08 July 2011

కంకాళాల నగరం

ఎండ కాచే కళ్ళు

ఎడారులు వీచే
భయపు
లోగిళ్ళు

ఏముందని వచ్చావు
ఈ సంకెళ్ళ
నగరంలోకి?

నీ హృదయాన్ని
నమిలి తింటారు వాళ్ళు
నీ కళ్ళను పెరికి
నీ కన్నీళ్లను
శీతల సీసాలలో
అమ్ముకుంటారు వాళ్ళు
నీ శరీరాన్ని
అలంకరణలో ముంచి
నాజూకైన సంచులలో
తాజా నిల్వలలో
వినియోగానికి నిన్ను
వివస్త్రను చేస్తారు వాళ్ళు

ఏముందని వచ్చావ్
ఇక్కడికి
ఏం చేద్దామని వచ్చావ్
ఇక్కడికి
ఈ కరాళ దంతాల
పిశాచదవడల
నగరం మధ్యకి?

ఊరుతోంది లాలాజలం
జిగటగా
అల్లుకుంటోందొక
వలయపు
సాలెగూడు
నిర్ధయగా=

హృదయాన్ని
హృదయంలో
పదిలంగా దోపుకుని
శరీరంలోకి
శరీరాన్ని
కుదురుగా చుట్టకుని
వెళ్ళిపో

వలస వచ్చిన
బ్రతక వచ్చిన
లోక సంచారి


నింగి కుంగి
నిప్పులు రాలే
వేళయ్యింది.

దీపం
వెలిగించేందుకు
నిన్ను
హత్తుకునేందుకు

ఎవరూ లేరిక్కడ .

1 comment: