ఉపోద్గాతం: నేను నీ వద్దకు ఎందుకు వస్తాను!
1. చీకటి ఆకాశాన్ని కనిపించని ఉదయంతో ఒళ్లంతా కప్పుకున్నవాడ్ని.
నువ్వు చూడని వృక్షాలు నా చేతులు
నన్ను నీ వద్దకు చేర్చే దారిలో కళ్ళతో నిలబడి ఉన్న కొండలు నా కాళ్ళు.
గుండెలో కొంత నిప్పు, కళ్ళలో కొంత నీరు
ఇక ఈ పూట దేనినీ కవితాత్మకంగా చెప్పను
ఇక ఈ పూట దేనినీ ప్రతీకాత్మకంగా మార్చను
2. దేహమంతా చలిస్తున్న మట్టి
భూమిని గాడంగా ప్రియురాలిలా కౌగలించుకున్నవాడ్ని
నేను చూడాలని సత్యాలు నీ పదాలు
నిన్ను నా వద్దకు రానివ్వని దారిలో
చెవులతో నిలబడి ఉన్న చందమామలు నీ హృదయాలు:
నాకు తెలుసు, నేను నీ దేహపు రక్తాన్ని
శ్వాసించక మునుపు ఈ ప్రపంచంలో రాళ్ళపై రాళ్ళూ
పదాలపై పదాలూ కవితలపై కవితలూ ఉన్నాయని.
కానీ, నువ్వక్కడ నేను లేని ఇంట్లో ఏం చేస్తూ ఉన్నావు?
నాకు తెలుసు, కానీ నేను చెప్పను.
ఇక ఈ పూట దేనినీ మామూలుగా చెప్పను
ఇక ఈ పూట దేనినీ ప్రతీకాత్మకంగా కాకుండా చెప్పను
మధ్యభాగము: నేను నీ వద్దకు ఎందుకు వస్తాను:
స్వీయరోదన: చీకటి. చివరి బస్సు వెళ్లిపోయింది ఆఖరి అంత్యక్రియలా. అక్కడ నువ్వున్న ఇంటి చుట్టూతా వర్షం కురుస్తుంది. నక్షత్రాలు పూల పరదాల్లా వాకిట్లో రాలతాయి. సన్నటి గాలికి కర్టైన్ కదిలి పాత ఇనుప గేటు కదిలి కీచురాళ్ళ శబ్దాల మధ్యగా పిలుపై వస్తే నువ్వు తల మాత్రం బయటకి పెట్టి తొంగి చూస్తావు. ఇంట్లో వర్షం కురుస్తుందా? నేను తెరిచి ఉంచిన పుస్తకాలపై వర్షం చినుకులు తడితడిగా పారాడి వడివడిగా కొన్ని పదాలను చెరిపి అర్థాలను సృష్టించాయా? గది లోపల పిల్లేదైనా కదులాడుతుందా? మెత్తటి పాదాలతో, జింక ఏదైనా తన బంగారు ఛాయతో నీ హృదయంలో నీ తోటలో గెంతుతుందా? ఎవరైనా విల్లంబులతో సిద్ధంగా ఉన్నారా? పోనీ కనీసం వర్షమైనా ఆగిందా?
ముగింపు: నేను నీ వద్దకు ఎందుకు వస్తాను:
ఉధృతంగా వీస్తున్న నలుదిశల గాలిని నింపుకున్నవాడిని
నువ్వు చూసే నీ ముఖం నాది
నిన్ను నా వద్దకు చేర్చే దారిలో ఎదురయ్యే ప్రతి జీవం నాది
నేను రాసే ఈ పదాలు నీవి
నన్ను నా వద్దకు చేర్చే దారిలో ఎదురయ్యే ప్రతి కదలికా నీది
నేను నీకు చెప్పాను: ఈ ప్రపంచంలో ఎదురుగా చీకట్లో
అనుక్షణికంలో మెరిసి మాయమయ్యే మిణుగురు వెలుతురులో
రాళ్ళపై రాళ్ళూ పదాలపై పదాలూ కవితలపై కవితలూ ఉంటాయని.
జీవితం ఒక తటిల్లతలో మెరిసి మాయమయ్యే కాంతి కనుక
అంతలోనే కరిగిపోయే కల కనుక, నేను నువ్వు కనుక
నేను నీ వద్దకు వస్తాను.
--------------------------------
Andhrajyothi sunday: 15-02-2004.
---------------------------------