30 June 2011

ఆఖరి దినం

ఆఖరి మాసపు ఆఖరి దినం

సర్దుకుంటున్నాను అన్నిటినీ
నన్ను నేను తప్ప:

ఉన్నాను ఇన్నాళ్ళుగా వాటితో
నేను,నాతో అవి తోడుగా నీడగా

హృదయంలోకి చేరుకున్న బల్ల
కళ్ళలో వేళ్ళూనుకుని ఎదిగిన

చెట్ల సంధ్యకాంతి.మెడ చుట్టూ
మెత్తటి చెయ్యై అల్లుకునే గాలి

పెదాలపై నీటి పరిమళం, ఎదలో
పిట్టల పిక్ పిక్ ల కలవరం

గోడపై మెరిసే గొంగళిపురుగులూ
ఎగిరొచ్చి వాలే పావురాళ్ళూ

గుడ్లున్న గూళ్ళు, గూళ్ళు చెదిరి
పగిలిపోయిన గుప్పెడు కలలు

టపటపా మని రివ్వున నింగికెగసే
కళ్ళలో చినుకులై చిప్పిల్లే పక్షుల

ఎడతెగని రెక్కలు: కొంత రాత్రి
కాంతి కొంత రాతి శాంతి.

వెళ్ళిపోతున్నాను సుదూరంగా
తపిస్తున్నాను వీడిపోలేనంతగా

సర్దుకుంటున్నాను అన్నిటినీ
నన్ను నేను తప్ప
నాకు నేను తప్ప:

=తరువాత, ఆ అతడి తరువాత
చీకట్లు ముసురుకున్న గదిలో

నిలువునా చీలిన తన మదిలో
ఒక దీపం వెలుగుతో కనిపిస్తే

అతడెక్కడో బ్రతికే ఉన్నాడని
అతడెక్కడో పదాలను కూడ

పెడుతున్నాడని గ్రహించండి=

1 comment: