నీడలతో కూర్చుంటావ్
ఒక్కడివే
నీడలలోని రంగులని
చూద్దామని
రంగులలోని నీటిని
తాకుదామని
ఒక్కడివే నిల్చుంటావు
చీకట్లలో
వెలిగే నయనాలలో
నయనాలలో కదిలే
దూరాలలో
దూరాలలో వెదికే
పద చరణాలతో
ఒక్కడివే తిరుగుతావ్
స్మశానాలన్నీ
చితిమంటలలో ఆదినీ
ఆదిలో రాత్రి అంతాన్నీ
కనుగొంటూ
ఎదురుచూస్తావ్ ఒక్కడివే
ఎవరికోసమో
ఎందుకోసమో=
సరే. రా. వచ్చి కూర్చో.
చీకట్లో రావి ఆకుల
నల్లని చల్లని ఎదలో
దప్పికగొన్న వాళ్ళు
తిరిగివచ్చే వేళయ్యింది
వొదిలివెళ్ళిన వాళ్ళు
తిరుగాడే రహస్య
సమయమయ్యింది
కనిపించని చేతులు
సేద తీర్చే వేళయ్యింది
మిణుగురులతో కళ్ళు
చెట్లల్లో ఎగిరే సమయం
ఆసన్నమయ్యింది
బాకులతో కలలతో
ఖడ్గ దంతాలతో
స్త్రీలు విహరించే
మధు వేళయ్యింది
రా. కూర్చో. హృదయాన్ని
తెరిచి. మరి కొద్దిసేపట్లో
నీడలూ, అద్రుశ్య జాడలూ
నిన్ను భక్షించే
క్రీడావినోదం అస్తిత్వ ఆనందం
మొదలవ్వనుంది.
ఇక నీ ఆఖరి ప్రార్ధన
ఆరంభించు=
No comments:
Post a Comment