అప్పుడు నువ్వో జంతువ్వి
కోరలు చాపి అరుస్తోంది
మనస్సులో మృగం ఒకటి
తెలీదు దయ,ఆనదు ప్రేమ
దానికి. జ్వలించే
కళ్ళూ ముళ్ళ నాలికా దాని
సొంతం. అవుతాయ్
ఆయుధాలు దాని మాటలూ
చేతులూ: అరుస్తోంది
పిల్లల మీద పడీ పడీ
నముల్తోంది
వాళ్ళని మరలా మరలా
విదిలించివేస్తోంది నిర్ధయగా
కసురుకుంటోంది కరకుగా=
ఆ పిల్లలు, పూలను కళ్ళలో
నింపుకుని ఎగిరే ఆ పిల్లలు
ఒళ్లంతా కన్నీళ్ళయ్యి, పగలు
రాత్రవ్వగా మృగానికి
దూరంగా ఎక్కడకని
పారిపోవాలి?
No comments:
Post a Comment