28 June 2011

విజయం

వడలిపోయింది నీ మోములో
ఒక పూవు ఈ పూట

శరీరం జ్వలనమై నాలిక దప్పికై
కళ్ళు ఎడారులలో విలీనమై

రాలిపోయింది నీ మోము
ఈపూట

కిటికీ పక్కన ఎదిగే నీడలలో
బల్లపై మిగిలిన పాత్రలో

ఎక్వరియంలో
చచ్చి తేలుతున్న
చేపపిల్లలో

మంచంపై ముడుచుకుని
ఎక్కిళ్ళతో కలవరిస్తున్న
అశ్రువులైన పిల్లవాడిలో

కుంగిపోయింది నీ మోము
ఈ పూట

ఇక్కడికి రావడమే
నిరుడు జన్మలో
నువ్వు చేసిన పాపం

ఇంకా బ్రతికి ఉండటమే
ఈ జన్మలో
నువ్వు సాధించిన
విజయం

లేవరా నాయనా లే!

లేచి వెళ్లి
నీటిఅద్దంలో
అద్దపు
అక్షరంలో

ముఖాన్ని
ముంచు-

1 comment: