వస్తుంది అది నీ వద్దకు
వేయి కాళ్ళ పురుగు
నీ నీడవలె చీకటిగా చిక్కగా
నిన్ను తినివేసేందుకు
పాదాలనునుంచి పదాలు లేని
భాషై వేయి నాలికలతో
చుట్టుకుంటోంది నిన్ను.
బండబారుతున్నాయి పెదాలు
విరిగిపోయి చినుకులుగా
చిట్లుతున్నాయి నయనాలు
ఒక ఇనుప ముద్ర పడుతోంది
నీ హృదయంపై జ్వలనమై
నవ్వుతోంది ప్రపంచం నీ ముఖాన
వికసించిన నిస్సహాయతపై
పారిపోలేవు ఎక్కడికీ
దాచలేవు నీలోని
ఎవ్వరినీ
చర్మం కింద పాకుతోంది.
రక్తాన్ని పీలుస్తో
సాగుతోంది
వేయి దంతాల విషపురుగు:
ఒరే నాయనా! చచ్చిపోకు.
నువ్వొక వెయ్యి రెక్కలతో
ఎగిరిపోయేదాకా
కాస్త బ్రతికి ఉండు. ఈ లోకాన్ని
పరిహసించే క్షణం
త్వరలో రానుంది.
No comments:
Post a Comment