20 June 2011

అప్పుడు గుర్తొస్తావ్

అప్పుడు గుర్తొస్తావ్

కడుపుని నింపుకున్న నీళ్ళు
కళ్ళలో చిప్పిల్లినప్పుడు

చిగురాకు మీద చందమామ
జారి కొలనులో పడినప్పుడు

గాలి గొంతుతో వర్షం చినుక్
చినుక్ మని పాడినప్పుడు

వెల్తురు గోళీలతో పదాలతో
పాపలు గజ్జెలతో ఆడినప్పుడు

తేనెను తాగిన చీమలు
బరువుగా మంచంవైపు
కదులుతున్నప్పుడు

పసి నవ్వు విరగబడినప్పుడు
పొద్దుతిరుగుడు పూలు
అక్కడ వికసించినప్పుడు

లేత కాంతిలో మధువులో
మునిగి ఎవరో పురాకాంతితో
అరచినప్పుడు
రోదించినప్పుడు

మనుషుల కర్మాగారంలో
నిశ్శబ్ధం పదమర్మాగారంలో
మూర్చిల్లినప్పుడు

వదనం అద్దమై
అద్దం వదనమై

ప్రతిబింబాల దంతాల కింద
పగిలిపోతున్నప్పుడు

ఒక్కడినే ఒక్కడినై
పాతాళ లోకాలలోకి వెళ్లి
పోతున్నప్పుడు

అప్పుడు గుర్తొస్తావ్.

ఈ పూట ఇక్కడ నీవు లేవ్
నీ నీడ మాత్రం ఉంది.

1 comment:

  1. baagundi sreekanth...so....inthakee asalu marichipoyindepudu...gurthukuraavadaaniki?

    ReplyDelete