తొడిమ నుంచి వేరైన
మల్లెమొగ్గలు వాళ్ళు
తెంపిందెవరు?
పూలను మరచినది
ఎవరు?
***
గడ్డిలో వానలో గెంతే
కప్పపిల్లలు వాళ్ళు
మరి అతడు
ఎవరు?
***
ఆగి ఉన్న దాగి ఉన్న
రాత్రి సర్పం
చుట్టుకుంటోంది
వలయమై
తన చుట్టూ:
సర్పజాలరి ఎక్కడ?
***
దీపం వెలిగించలేదు
పలుక పదం లేదు
వర్షం ఆగలేదు
కంట నీరు దాగలేదు
ఇన్నాళ్లుగా
ఇంత దుఃఖ౦
ఎప్పుడూ
దిగమింగుకోలేదు:
చీకట్లోకి మసక
చంద్రుడితో
అతడు ఎక్కడ
రాలి పడ్డాడు?
***
పూవు నుంచి వేరైన
ఆకుపచ్చని ముల్లు
అతడు:
ఈదురు గాలుల్లో
నల్లని వెన్నెలలో
హృదయగ్రహణంలో
దారీ తెన్నూ లేని
అతడు:
కోల్పోయినది ఎవరు?
పొందినది ఎవరు?
*
No comments:
Post a Comment