ప్రతి నిర్మానుష్యపు వీధి చివర చీకట్లో నువ్వు నీకై ఎదురు చూస్తావు. ఓపికగా ఒక ఉన్మాద హంతకుడిలా మాటువేసిన పులిలా నిన్ను నువ్వు భక్షించేందుకై నువ్వు నీకై ఎదురు చూస్తావు.
తెలియనిదానికై తెలిసినదానిని వొదిలివేసి స్వహింసతో గాయపడే మూర్ఖపు జ్ఞానివి నీవు. ఇతరులని సంతకం చేసే ఈ పదాల ప్రపంచపు అద్దాలలో తిరుగాడే దెయ్యానివి నీవు. నీ జీవితం ఎలా గడుస్తున్నదో నీకు తెలుసా?
అసంకల్పితంగా నీ దినాలు గడచిపోతాయి. సంవత్సరాలు దొర్లిపోతాయి. క్రమంగా నీ చర్మం ముడతలుపడి చిక్కగానూ చీకటిగానూ మారుతుంది. నువ్వు జన్మించినప్పుడు
నిన్ను అంటిపెట్టుకుని ఉన్న వాసన ఇప్పటికీ నీ శరీరాన్ని తన మార్మిక హస్తాలతో కప్పి ఉంచుతుంది. ఇక నీ గదిలో అందరికీ తెలిసిన రహస్య అరలలో అస్థిపంజరాలూ పుస్తకాలూ స్నేహితులూ
నిన్ను వొదిలివేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రక్తం నిండిన కనులతో నీపైకి దుమికే స్త్రీలూ దాగి ఉంటారు.నువ్వు ఇప్పటికీ పిచ్చివాళ్ళతోటీ భిక్షగాళ్ళతోటీ
జీవితంచే శిరచ్చేధన కావింపబడి రోదించే మనుషులతో నిండిన నాసిరకపు ఇరానీ హోటళ్ళలో భోజనం చేస్తావు. ఈలోగా పచ్చిరాత్రిలో పచ్చి గాయాల్లా మెరిసే వ్యభిచారిణులు
బయట రహదారుల్లో ఎదురు చూస్తారు. నువ్వు అప్పటికే పదాలను వింటుంటావు: పదాల ప్రతిధ్వనులనూ రక్తమూ అస్థిత్వమూ లేని పునరావృతమయ్యే పురాణాలుగా మారిన పదాలను
పెదాలరహిత ముఖాలలోంచి వాచాకాలలోంచీ వాగ్ధానాలలోంచీ విన్తున్తావు. "లింగరహితాలు" అటువంటి పదాల గురించి నువ్వు అనుకోదగినదల్లా "లింగరహిత పదాలు తల్లులు లేని శిశువులు."
ఇక నీ గది బయట బలిష్టమైన బాహువులతో ఊగే వృక్షాలు, సర్పాలు భక్షించిన పక్షులతో కొమ్మలలోంచి నేల రాలి పగిలిపోయిన అనాధ పక్షి గుడ్లతో ఇంకా జీవంతో చలిస్తూనే ఉంటాయి.
ఈలోగా వృక్షాల మధ్య గుమికూడే నీడలు నీతో సంభాషిస్తాయి. రోదిస్తాయి. రక్తాన్ని స్రవిస్తాయి. నువ్వు చేయగలిగినది ఏమీ లేదు. ఏదైనా ఉంటె అది ఈ ప్రపంచపు మరో అంచు నుంచి నిన్ను చేరుకుంటున్న కుక్క రోదనలా
నువ్వు కూడా నీలో ముడుచుకుని భీతావాహకమైన కనులతో దుఃఖించాలి. ఎవరికి తెలుసు? చనిపోతూనో రోదిస్తూనో ఊళ పెట్టె కుక్క నీవు కాదని ఎవరికి తెలుసు?
శాంతి. అదొక విలాసవంతమైన, నీకు అందని విషయమనీ నీకు ఎప్పటినుంచో తెలుసు. ఇక నీకు ఈ ఒంటరి రాత్రికి మిగిలినదల్లా ఈ రాత్రిని దాటేందుకు ఉన్న ఒక పాత్ర నాసిరకపు మధువు.
నీకై దు:ఖించే స్నేహితుడు మరెక్కడో ఒంటరిగా ఒక పదం అంచున ఒక ఖడ్గం అంచున కొన ఊపిరితో జీవిస్తుంటాడు. అతడు ఇప్పటికీ ఆ ఒకే ఒక్క స్త్రీకై హృదయ కంపనతో అద్దాలలో వెదుకులాడుకుంటాడు.
అతడు శతాబ్దపు సమాధుల మధ్య ఆమెకై తడుముకులాడతాడు. సమయపు ఖడ్గం నిర్భయంగా, అప్రతిహతంగా అతడివైపు దూసుకువస్తుండగా బహుసా మరెంతో సమయం మిగిలి లేదు అతడు శిరచ్చేధం కావింపబడేందుకు
ఆమెకై చెక్కిన పదాలతో సమాధి కావింపబడేందుకు మరెంతో సమయం మిగిలి లేదు. ఇక ఇక్కడ నీవు, ఇతరుల
ఆలోచనలచే శిరచ్చేదం కావింపబడి అన్ని ఇళ్ళ చీకటి గుహలలో ఎదురు చూస్తావు. ఎప్పుడు రాలిపడతావో ఎప్పుడు మరణిస్తావో తెలీక పదాల అంచులను పట్టుకుని కొనఊపిరితో వేలాడతావు.
నీ స్నేహితుడివైపు దూసుకువచ్చే ఆ సమయపు ఖడ్గమే నీ వైపూ నిష్పాక్షికంగా దూసుకువస్తుండగా, తెలియనిదానికై వెదుకుతూ, దాని స్మృతిలో చెక్కిన పదాలతో నువ్వూ సమాధి అయ్యేందుకు మరెంతో సమయం లేదు.
విగ్రహాలు. ప్రతి పదం నువ్వు ప్రార్ధించే ఒక విగ్రహం. ప్రతి పదం నీకై నిన్ను నువ్వు బలి ఇచ్చుకునే శ్వాసించే ఒక శిలావిగ్రహం.
ఏమీ మారలేదు. ఏమీ మారదు కూడా. సంతాపానికై సంతాపం వ్యక్తం చేస్తూ, ఎదురుచూపుకై ఎదురుచూస్తూ, రాయటానికై రాస్తూ,
ముందే ఎన్నిక చేయబడ్డ వాటి మధ్య ఎన్నుకోమంటే ఎవరైనా ఏం చేస్తారు?
(ఆంధ్రజ్యోతి "వివిధ". 03.04.2006. *ఇప్పటికీ ఇన్నేళ్ళ తరువాత కూడా ఏమీ మారినట్టు లేదు*)
No comments:
Post a Comment