10 June 2011

తెంపుకుంటావ్ నువ్వు పూలను


తెంపుకుంటావ్ నువ్వు పూలను
ఆ కనకాంబరం పూలను, ఉదయపు కాంతి మెరిసే వేళల్లో. మరి అందుకే
మెరిసిపోతోంది నీ ముఖం ఈ దినం
నీ కాంతిలో కనకాంబరపు రంగులో.

ఇక తెంపుతావు ఒక్కో పూవునే, రెండు వేళ్ళ మధ్య మెత్తగా ఒడిసి పట్టి

బంగారు రంగు మెరిసే నీ చేతులతో, పెదాల చివర వాలిన
చల్లని  చిర్నవ్వుతో, పచ్చటి పల్చటి స్వరంతో
కదులుతావు ఆ పూల మధ్య అలా అలా అలా.

ఇక అందుకే, ఇక అప్పుడే దూసుకువస్తుంది ఎక్కడి నుంచో ఒక వర్షపు
గాలి నీ శి/రోజాలను చెరిపేందుకూ
నీ శరీరంతో అలా ఆడుకునేందుకూ.

మరి నిన్నూ నీ చుట్టూతా వెన్నెల వలయమై తిరుగాడే నీ పిల్లల నవ్వుల
ముఖాల్ని చూస్తో, కూర్చుని ఉన్నాడు
అక్కడే ఈ అపరిచితుడు, శాపగ్రస్థుడు
నిన్ను ప్రేమించినవాడు, నిన్ను దాటి

ఎక్కడికీ పోలేని వాడు, ఎవరూ లేని వాడు, దారీ తెన్నూ లేక నీ దయ తాకక

నీ వీక్షణ సోకక, ఒక మధుపాత్రధారియై
వేచి ఉన్నాడు అక్కడే, నీ చేతివేళ్ళ మధ్య
తెంపబడే పూవై, హృదయంలోంచి సూదివై
నువ్ చొచ్చుకుపోయి అల్లే హారానికై, ఆపై అలంకరణంగా మారేందుకై, మారి

అంతిమంగా వడలిపోయే౦దుకై, ఇక్కడే నీ వద్దే నీతో రాలిపోయే౦దుకై-

1 comment: