21 June 2011

ఆ రాత్రుళ్ళు 2.

రాత్రి ఆకు అంచునుంచి రాలుతోంది
ఒక రక్తపు చినుకు

చీకటి బూజు అల్లుకున్న గదిలో
శాపగ్రస్థుడి దిగులు మదిలో

కదులుతోందొక స్త్రీ నయనం
సాగలేని జీవితపు చెమ్మతో=

ఆ రాత్రే, అస్థిత్వంలోకి బాకు
ఒకటి దిగబడి

సుడులు తిరుగుతున్న రాక్షస
రాత్రిలోనే నువ్వు వొచ్చావ్

ఆకాశం నుంచి రాలుతోన్న
కొండచిలువల ధార కింద

అతడు నిస్సహాయంగా అరుస్తో
రోదిస్తోన్న అవిటిరాత్రిలోనే

నువ్ వొచ్చావ్ ఒక దీపాన్ని
దీపపు కాలాన్నీ పుచ్చుకొని

అతడిని పొదివి పుచ్చుకునేందుకు
అతడిలో నీ శరీరాన్ని

వొదివేసేందుకు
నువ్ వొచ్చావ్ చీరికలైన వస్త్రానివై
తెల్లటి పూవువై:

చీకటి బూజులో సాలీడు అతడు
గూడు లేని గూటిలో

ఇరుక్కున్న మిడత అతడు=

నువ్ అతడిని హత్తుకొన్నప్పుడు
కొమ్మలలోని పక్షులు

అలజడిగా కదులాడాయి: దూరాన
పొదలలో సర్పమొకటి

సర్పబాహువులకై
సర్పసుందరమైన లోకంలోకి జారింది

శ్మశాన నిశ్శబ్ధంలోకీ సమాధుల
కరుణలోకీ ఒక నక్షత్ర కాంతి

రాలిపడింది. హంతకులు ముసిరిన
రహదారులలో ఒక తల్లి

అనాధ శిశువుకి స్థన్యంగా మారింది
తనకి తాను గాయంగా మిగిలింది

నువ్ నడచి వచ్చిన రాత్రిగదిలోకి
సర్వ ప్రపంచమూ కదిలింది

నువ్ వచ్చిన దారంతా
నీ నెత్తుటి పాదముద్రలు నువ్ విప్పి
చెప్పలేని చిట్లిన పదపెదాలు

భాష లేదు ఆ రాత్రికి. భావం లేదు
ఆ శోకానికి నా శాపానికీ-

చూడు. నిన్ తలుచుకున్నప్పుడల్లా
ఇప్పటికీ పదాలవెంట

సాగుతోన్న నీ రక్తపు నీడ. నా వెంట
సాగుతోన్న నీ జాడ.

ఇక ఈ వాక్యాంతాన అతడు

శరీరం లేని శరీరమై తిరుగుతాడు
ఒక ఇనుప తోటలో శిధిలమై=

చూసేందుకు నువ్ ఎప్పటికీ రాకు.

No comments:

Post a Comment