అక్కడే ఉంటుంది అది పచ్చగా
హృదయాన్ని చుట్టుకుని-
బచ్చలి ఆకుల అరచేతులలో
పొదిగిన పచ్చదీపం అది
పచ్చటి కాంతి పచ్చటి భాషా
దానిది. నింపాదిగా
కదులుతోంది. అంతలోనే ఆగి
తల తిప్పి నీ వైపు చూస్తోంది
నీవంటి పసరిక పాము:
పూలనూ ముళ్లనూ
జన్మిస్తోన్న ఆకులనూ
మెత్తగా తాకే
నీవంటి పసరిక పాము: ఇంతకు
మునుపు చూసావా దానిని?
ఎవరికీ హానీ చేయని, అలా తన
లోకంలో తాను సాగిపోయే
రూప లావణ్యమైన పసరిక
శాంతిని? దాని కళ్ళలోని
కాంతి ప్రపంచాల్ని?
స్వప్నించావు నువ్వు దానిని
స్పర్శించావు నువ్వు దానిని
అల్లుకున్న పొదరిల్లు కింద
దానితో కదులుతూ
అనేక మార్లు గమనించావు
పూల మధ్య ఆకుపచ్చ దారమై
వేలాడే దాని సొగసులని
వంకీలు తిరిగే దాని కదలికల్ని=
చిన్నవాడివి అప్పుడు నీవు
చింతలేనివాడివి అప్పుడు నీవు
సర్పప్రపంచంలో సర్పమై
తిరుగాడే బాలుడవి నీవు
దినాలు గడిచినాయి ఋతువులు
చేజారినాయి. అక్కడే
ఉంటుంది అనుకున్న పచ్చటి
పసరిక పాముని
నీ హృదయంలోంచి నిర్ధయగా
వెలుపలికి లాగి కర్రలతో
నుజ్జునుజ్జు చేసారెవరో
వెళ్లి చూడు రహదారి పక్కగా
చచ్చి పచ్చిగా పడి ఉన్న
వంకీలు తిరిగిన
కనులు చిట్లిన
అతడి శరీరాన్ని=
liked it..
ReplyDelete