02 June 2011

లిప్తకాలం

వేసవి అంతాన వలయమవుతున్నాయి నల్లటి మబ్బులు -

ఆ సంధ్యారుణిమ కాంతిలో మెరిసే వదనంతో
వెన్నెల వంటి ఐదేళ్ళ పిల్లవాడు
నా చేతి వేలు పుచ్చుకుని నడుస్తూ అడుగుతాడు:

"నాన్నా నేను నీ అంత అయ్యాక, నువ్వు ఎంత అవుతావు?"
నేను అంటాను కదా: "అప్పటికి నేను
ఉండను కన్నా." "ఎక్కడికి వెళ్లిపోతావు నాన్నా?"

నిశ్శబ్దం మరోమారు అనుభవమై అంటాను నింగిని చూయిస్తూ:
"రాత్రైతే వస్తాయి కదా నక్షత్రాలు ...
వాటిలోనో, ఈ నేలలోనో కలిసిపోయి ఉంటానురా"

విశ్వమంత విప్పారిన కనులతో తిరిగి అడుగుతాడు వాడు
అయోమయమై: "ఎలా నాన్నా?"
"చచ్చిపోయి ఉంటానురా నేను ... అప్పటికి ..."

"మరి మనం తిరిగి ఎప్పుడు కలుసుకుంటాం నాన్నా?"

ఇక నడక ఆపి, మాటలు ఆపి, గొంతు గాయమై రహదారిపై
మోకాళ్ళపై కూర్చుని, వాడి తెల్లని
కుందేలు పిల్లల కళ్ళలోకి చూస్తూ చెబుతాను:

"వస్తే, నువ్వు నా వద్దకు వచ్చినట్టు నేను నీ వద్దకు వస్తాను
కన్నా ..." అతడికి అర్థమయ్యీ కాక
ప్రప్రధమంగా నిశ్శబ్ధం అనుభవమై కాసేపాగి అంటాడు:

"నాన్నా ...నీకప్పుడు చక్కగా స్నానం చేయిస్తాను. అన్నం
పెడతాను. ఆడుకోటానికి బయటికి
తీసుకు వెళ్తాను. నీకు బోలెడు బొమ్మలు కొనిపెడతాను...
నాన్నా, నువ్వు నా దగ్గరికి వస్తావా నాన్నా?"

నేను సమాధానం చెప్పను. కొంత అరుణిమ. కొంత వొణుకు
కొంత ప్రీతి. కొంత శాంతి. ఇంకొంత
పురాజన్మల, పునర్జన్మల మృత్యు అనుభూతి. స్మృతి -

వేసవి అంతాన వలయమై నల్లటి మబ్బులు కురుస్తున్నాయి
దిగంతాలలో, దిగులు దినాలలో
నా కళ్ళల్లో: దయగా ధారగా వాడి అరచేతులంత మెత్తగా –

ఇక రాబోయే కాలమే గడచిన బ్రతుకంత సంక్షిప్తం. సుదీర్గం.
అనంతం –

2 comments:

  1. gundeni kavitvamtho maree inthagaa meli pettaalaa sree...? by the way, 'aakasamloni chukkallo vuntaanu' anna maata naaku 'Lion King' cinema ni gurthuku thetchindi....

    ReplyDelete