26 May 2012

అమ్మ పదాలు*

నువ్వు బాధను అనుభూతి చెంధగాలవా? ఆమె పాదం మోపినప్పుడు, గుమ్మంలోంచి బరువుగా, మరో పరిమళం లేని పోనీ మరో మొగ్గైనా లేని బాధాపూరిత వెలుగులోకి ఆమె పాదం మోపినప్పుడు, ఆమె పాదాల కింది మట్టి ఆమె బాధతో మరి కొద్దిగా కుంగుతుంది. పగలేనా? రాత్రీ కావొచ్చు, నిర్లిప్తంగా ఆమె తిరిగి వచ్చినప్పుడు, లేదా సాయంత్రం మంచానికి చేరగిలబడి కుచ్చిళ్ళను మోకాళ్ళ దాకా జారుపుకుని ఆమె నిర్లిప్తంగా రెండు చేతి వేళ్ళతో పాదాలని రుద్దుకుంటున్నప్పుడు ఆ నొప్పెమైనా మందగిస్తుందేమోనని, పసుపు పచ్చటి చేతివేళ్ళతో ఒకప్పుడు కాళ్ళ మధ్య శిశువును మృదువుగా రుద్దుతూ స్నానం చేయించినట్టు పాదాల్ని వేళ్ళ కొసలతో నొక్కి పట్టుకుంటున్నప్పుడు, నేనా బాధను అనుభూతి చెందగలనా?

నీకు తెలుసు. ప్రేమించకుండా ద్వేషించకుండా బ్రతకడం - ప్రేమా లేదు, ద్వేషమూ లేదు. వొద్దనుకున్నా, గిల గిలా కొట్టుకుని బయటకు వచ్చినా వెంటనే బలంగా లోపలి లాక్కునే బాధ. ఈ దేహం. దేహంలోని రక్తం, రక్తాన్ని అంటి పెట్టుకుని ఉండే కలలూ, కలల అంచున కరగకుండా గడ్డ కట్టుకుని ఉన్న కన్నీళ్ళూ, ఒక నిర్లిప్తపు నిశ్చల చెట్ల గుంపుల నీడల మధ్యకు నెట్టివేసే ఈ జీవితం నీకు తెలుసు.

కొన్నిసార్లు, కొన్ని క్షణాలలో ఈ దేహం జ్వలిస్తుంది. చీకట్లో గాలికి రగులుకునే మంటలానూ ఆకాశానికి ఎగిసిపడే అగ్ని పుష్పం లోని వివిధ రంగుల రేకుల గానూ ఒకే ఒక్క క్షణంలో ప్రేమా, ఉద్రేకమూ శాంతీ కూడానూ. కొన్నిసార్లు, ఈ వేళ్ళ కొసల అంచున వెన్నెల అలలని ప్రవహింప జేయవచ్చు. ఈ కనులతో సూర్యరశ్మిని మృదువుగా, వేకువఝామున గూళ్ళ లోంచి రెక్కలు విదిల్చి ఎగిరిన పక్షుల లానూ మృదు ఘాడంగా విప్పార్చవచ్చు. కొన్నిసార్లు, ఒకే క్షణంలో ఈ దేహం నిండుగా తొణికిసలాడే, ముట్టుకుంటే ఒలికిపోయేటట్టు ఉండే ప్రేమా, ఉద్వేగామూ శాంతీ కూడానూ. చేయి చాచి దేహాన్ని స్పర్శిస్తే, వేళ్ళకు అంటుకుని తిరిగి స్పర్శించే దాకా అంటి పెట్టుకుని ఉండే వాసన లేని పరిమళ మొకటి. ఆమె స్పర్శించినప్పుడు స్పర్సలో కదులాడే అధ్రుస్యపు జల ధార ఒకటి.

నేను కదులుతాను

నా శరీరం చుట్టూ ఉన్న నిశ్శబ్ద దు:క్కంతో ఆమె పరిధిలోకి నడుస్తాను. ఆమె చేతి వేళ్ళలోకి ఇమిడిపోయి ఆమె చేతి వేళ్ళతో పాటు నొప్పితో కలుక్కుమంటున్న పాదంపై కదులుతాను. సాయం సామయపు సూర్యుడు విచ్చుకున్న ఒక మేఘపు ఖడ్గంతో తునకలైనట్టు, ఆమె సంధ్యా సమయం పాదంపై ఆమె చేతి వేళ్ళ మేఘ మాలికలతో పాటు అల్లుకుపోతాను. ఆమె పాదం మోపినప్పుడు, గుమ్మంలోంచి భారంగా, ఎటువంటి ఉద్వేగామూ లేని, పోనీ కనుల చలనమైనా లేని బాధాపూరితమైన పగటి లోకి ఆమె పాదం మోపినప్పుడు ఆమె పాదాల కింద రహస్యంగా ప్రయాణిస్తాను. ఆ పాదాల దు:క్కాన్ని నా శరీరంతో మోస్తాను. పగలు, లేదా రాత్రి, నిర్లిప్తంగా ఆమె తిరిగి వచ్చినప్పుడు లేదా మార్గ మధ్యంలో ముఖం ముకుళితమయ్యి ఆగిపోయినప్పుడు, ఆమెనూ ఆమె రెండు పాదాలనూ భుజంపై అమర్చుకుంటాను. తల్లీ, నేను మార్పు చేయగల క్షణమేదైనా వస్తే, నా జీవితాన్ని నీ రెండు పాదాల కింద పరుస్తాను. నువ్వు నడిచినంత మేరా భూమిపై తేలే ఒక పక్షి ఈకనై నిన్ను ఇంటికి మోసుకు వస్తాను. ఇదొక వాంఛ.

ఆగిపోని వేదన ఇది. దయ, పోనీ కరుణ అయినా లేని ప్రేమించానూ లేని ద్వేషించనూ లేని, వొట్టి దు:క్కం మాత్రమే దేహంలో కొట్టుకులాడే స్థితి ఇది. ఈ నిర్లిప్త సమయాలలో నీతో పాటు జన్మించిన పదాలు ఇవీ. కాదు, నువ్వు పేగు తెంచి ఇచ్చిన అక్షారాలు ఇవి. సంధ్యా సమయంలో గూటికి చేరుకునే పక్షుల్లా, ఎక్కడెక్కడో తిరిగి ఆత్రుతగా నీ వద్దకు తిరిగి వచ్చే పదాలు ఇవి. బహుశా, సాయంకాలం బేబీ కేర్ సెంటర్ ల వద్దకు పరుగెత్తే తల్లుల హృదాలు ఇవీ. నువ్విచ్చిన రక్తంతో నువ్వే అయిన ఈ పదాలు నా వద్ద తాత్కాలికంగా తార్లాడి నీ వద్దకి తిరిగి వస్తాయి. అవిశ్రాంత దీర్ఘ పగటి ఎదురు చూపుల తరువాత తల్లి ముఖం కనిపిస్తే, ముఖాలు వికసించి నిర్బంధంలోంచి ఆ కౌగిలి వైపు ఆ గోరువెచ్చని దేహం వైపూ శక్తినంతా కూడగట్టుకుని వేగంగా, తడబడే అడుగులతో పరిగెత్తే పసి పిల్లలు ఇవీ. వాటిని, నా శరీరాన్ని రెండు అరచేతులుగా మార్చి నీకు ఇస్తున్నాను. తీసుకో. నీకు తెలుసు, ఇంత కంటే ఇంతకు మించీ నీకు ఇవ్వగలిగినదేదీ నా వద్ద లేదనీ, ఉండదనీ-

1 comment:

  1. kallu cemarcaayi
    gunde baruvekkindi

    నువ్వు నడిచినంత మేరా భూమిపై తేలే ఒక పక్షి ఈకనై నిన్ను ఇంటికి మోసుకు వస్తాను. ఇదొక వాంఛ.

    ఈ అక్షరాలను రెప్పలక్రింద దాచుకునేందుకు ఇక్కడ వుంచినందుకు ధన్యవాదాలు

    ReplyDelete