తల దగ్గర
ఒక దీపం వెలిగించుకుని కూర్చుంటావు నువ్ రాత్రంతా
నీ నాలికపై చేదు
నీ వొంట్లో వొణుకు
కళ్ళేమో శవాలు
అంతం లేని స్మశానం వలె పరచుకున్న ఆకాశంలో
కాలే ఒక చితి వద్ద
నిస్సహాయంగా వొరిగిన నీ చూపులు శిక్షా స్మృతులు
(- దానిని నువ్వు ఒక
- నక్షత్రం అని పిలవలేవు
- యిక ఎన్నటికీ_ )
నీ తల దగ్గర
దీపం వెలిగించాల్సిన వాళ్ళూ, నీ మృత దేహాన్ని అంటించాల్సిన వాళ్ళూ
తగలబడుతున్నారు ఇప్పుడే యిక్కడే
బ్రతికుండగానే నిన్ను తగలబెట్టేంత ఆ
పగతో ప్రేమతో ప్రతీకారంతో
మధుపాత్రల నిండా ముంచుకున్న తమ ఛితాభాస్మంతో మృత్యుహాసంతో-
...యిక ఎక్కడకి వెళ్తావ్ నువ్వు
చనుబాలు లేని చూచుకం లేని
ఈ లోకపు తల్లి స్థన్యంతో, తండ్రి లేని తనంతో తనువు లేని తనంతో నీతో నువ్వు?
No comments:
Post a Comment