23 May 2012

ఒకసారి

అరచేతుల్లో
ముఖాన్ని సమాధి చేసుకుని

చేతి వేళ్ళతో
తడిచిన రెప్పలని రుద్దుకుంటో

భూమంత
శ్వాసని తీసుకుంటావు నువ్వు

పలకలుగా
విరిగిన గుండెలోకి, కాలంలోకి-

హృదయంలో

వెలిగే ఆ తెల్లటి దీపపు
నల్లటి కాంతి అంచున
నీ నిద్రను ఉంచుతావు

ఒక శవాన్ని స్వప్నిస్తావు
స్మశానాలని పూలగా
తేనెపిట్టల తోటలుగా ఊహిస్తావు

ఒక నిస్సహాయతతో
శరీరాన్ని మొత్తంగా
అరచేతులలో దోపుకుని

తిరిగి నీలోకి నువ్వే
రాలిపడతావు
పిగిలిపోతావు

ఇంతకూ తెలుసునా నీకు?

చచ్చిపోతాం మనం
... బహుశా ఇలాగే

శరీరమంత శూన్యంతో
ఆ ప్రేమంత పాపంతో
భరించలేని దిగులుతో- అని?

1 comment: