పాడుబడిన బావి తొవ్వలో
నిండా విరిసిన గన్నేరు పూలను చూసావా ఎన్నడైనా?
గమ్మత్తుగా గుర్తుకు తెస్తాయి అవి మరి
కొన్ని మహా విషపు ప్రేమలనూ
కొన్ని కారుణ్యం లేని కౌగిళ్ళనూ
తన కాలి పట్టాలనూ, ఆ గోరింటాకు అరచేతులనూ
పూల దండలై నిన్ను చుట్టుకున్న పసి చేతులనూ-
మదిలో
గుబులు గుబులుగా మెసులుతోన్న పావురాళ్ళ అలజడి
శరీరంలో
బెదురు బెదురుగా కదులుతోన్న నల్లటి తెరల సవ్వడి
శ్వేత మేఘ మాలికలై పారుతున్న ఆకాశంలో
విచ్చుకున్న నిండు జాబిలి
నీ మెడ చుట్టూ కృష్ణ సర్పమై బిగుసుకునే ఉరి-
ఏంటంటావా ఇది? ఆహ్ ఏమీలేదు
ఇదంతా, అంతా ఇంతకు మునుపు చూడక
పాడుబడిన బావిలో రాలిన తొవ్వలో
నడుద్దామని బయలుదేరిన జీవికి
ఎదురైన నిండు గన్నేరు పూల వద్ద
ఆగిన పదాల విలాపం
క్షణకాలం మృత్యు విరామం- అంతే!
super ga rasarandi...
ReplyDeleteనచ్చింది...గన్నేరు పూల వాసనా...
ReplyDelete