08 May 2012

నీకేం పని?

నీ నుదిటిన వెలుగుతుందొక నలుపు దీపం-

చూసుకుంటాను కంకాళంగా మారిన
నా ముఖాన్ని ఆ ఆకుపచ్చటి కాంతిలో

చిక్కటి
చీకటి కమ్ముకున్న రాత్రుళ్ళలో

అప్పుడే గర్భంలోంచి బయట పడ్డ శిశువు
తొలిసారిగా ఈ లోకపు శ్వాసని
తల్లి చూచుకాన్నీ గుప్పిళ్ళ నిండుగా

తన గుండెలోకి పీల్చుకున్నట్టూ అందుకున్నట్టూ

చినుకులకు చిత్తడైన నీడల ప్రాంగణంలో
నిన్న విరిసి ఇవాళ రాలే
...పూల అంతిమ ప్రార్ధనలనూ

రేపు అకస్మాత్తుగా వీడిపోయే ఆకుల
సవ్వడిని భీతితో వింటూ

నీ
హృదయ ధ్వనిని కొద్దిగా కాపాడుకుంటూ, దిగంతాలలో

నీ అరచేతులను పుచ్చుకుని
అలాగే అక్కడే కూర్చుంటాను
నలుపు మంటలపై నా పెదాల్ని ఆన్చి అలాగే విస్తుపోతాను-

నీ శరీరంలో వెలుగుతుందొక దీపం
రెక్కల అలజడితో కదులుతుందొక
కువకువలాడే నల్లటి పావురం
ఆ లేత ఎరుపు కళ్ళతో బెంగగా
కాళ్ళకు అడ్డం పడుతుంది ఒక హిరణ్యం-

ఏడవకు, వెళ్ళిపోయిన వాళ్ళూ
.......అలా వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళూ
నిన్ను నల్లటి దుస్తులతో
పరామర్సించేందుకు, చితులతో సమాదులతో వచ్చే వేళయ్యింది

యిక ఈ శవంతో, యిక ఈ శాపంతో
నీకేం పని?

No comments:

Post a Comment