19 May 2012

నీకై 14*

తన కళ్ళను మాత్రం వొదిలి
తన ముఖాన్ని పూర్తిగా చుట్టుకున్న అజగరం దుప్పట్టా

యిక మరి తన ముఖమేమో ముఖం లేకుండా
ముందున్న విద్యుత్ తెరల పరదాలలో ముఖ పుస్తకాలలో నిండుగా మునిగింది

తన చేతివేళ్లు, తెలియదా నీకు, అవి
మంచు మల్లె పూల అగ్ని తీగలు
నిను నిలువెల్లా దగ్ధం చేసే కీలలు

అల్లుతాయి అవి అక్షరాలను శర శరా
వొదులుతాయి అవి పదాలను
శరాఘాతాల్లా, మృదు మృత్యువులా-

మడచిన చేతిలోంచి చెవిలోకి సాగుతోంది
ఒకనొక రహస్య సమాచారం
పల్చగా కదిలే పరదాలోంచి
మెరుస్తోంది పెదాలు ఇచ్చే వింత విషం-

యిక్కడ కూర్చుని అక్కడ బ్రతుకుతూ
మధుపాత్రలో మోముని చూసుకుంటూ

తన ఎదురుగా ఎండగా మారిన నీడలో
అపరాధిగా నిలబెట్టిన తనువులో
స్పృహ తప్పిన ఫిరోజ్ ఇలా అంటాడు:

అమ్మాయీ, మాయా కర్ణ భేరిలోంచి
నీ స్వరాన్ని కొంచెం పక్కకు జరపగలిగితే
అమ్మాయీ, ముఖే ముఖ వాచకపు
రాచరికపు ఊబిలోంచి నీ ముఖాన్ని
కొంత సేపు అలా పైకి లేపి ఉంచగలిగితే

జాబిలిని చుట్టిన చీకటి దుప్పట్టాని
అలా ముని వేళ్ళతో నువ్వు తొలగించగలిగితే

నీ చూపుల నీళ్ళలో తన ముఖాన్నీ
పాదాల్నీ చేతుల్నీ కడుక్కుని యిక
ఫిరోజ్
యంత్ర తంత్ర లోకంలోకి

తనని తాను బలి ఇచ్చుకునేందుకు
నీ రాహిత్యంతో వెడతాడు- యిక

కాలాన్నీ, ఈ జనాల జగజ్జెంత్రీలనీ

వేటాడేందుకు నీకేం అడ్డు- యిక
రాసుకునేందుకు అతడికేం అడ్డు?

3 comments:

  1. motham meda నిషిధ్దం lekunda" neekai" raasaaru.

    ReplyDelete
  2. "నీకై"...సిరీస్....ఊ చిన్న పుస్తకం గ వేయొచ్చు........గీతాంజలి ల.....నెరుడా..లవ్ పోఎమ్స్ ల........ఆలోచించు.....

    ReplyDelete