06 May 2012

రాత్రి లత

దిగులు దీపం పెట్టుకుని
ఒంటరిగా ఒక్కడే అ/తను - అద్దంలోంచి తన ముఖాన్ని తనే లాక్కుని
గాలిలోకి వెదజల్లుదామని
...ఒంటరిగదిలో నెత్తురు శిల వలె వలయమై అ/తను *-

ఈ చదరపు గోడలలో విత్తనాలు నాటలేమని
అ/తనకి తెలుసు
ఈ లోహపు దారులలో చినుకులు ఇంకవని
అ/తనకి తెలుసు

బాల్కానీలో కుండీలో గాలికి చల్లగా కదులుతూ ఇనుపు చట్రాలను అల్లుకునే
పూలు పూయని లతవు నువ్వనీ
.......................మృతుల కాలంలో శ్వాసవి నీవనీ ఇద్దరికీ తెలుసు

తెలిసి ఉండటం వల్ల తెలియక
ఒక మహా నీలి జాబిలి ఆకాశంలో బద్ధలైన వేళ
వెన్నెల అంచులను దాటి భూమిని ముంచెత్తివేళ

ఒంటరిగా గదిలోని దీపాలను ఆర్పుకుని
అవి మిగిల్చిన ధూపదర్పణాల అంచులపై
తమ మణికట్టులను ఉంచుతో

చీకటికి అటువైపు తనూ
..చీకటికి ఇటువైపు నువ్వు-

మృత్యువు ఎలా మొదలవుతుందో
యిక చెప్పేదేముంది
వాళ్ళకైనా మీకైనా-?
_______________________________________
అ/తను = అతను+తను (used to mean both 'him' and 'her')

1 comment: