విచ్చుకుంటున్న అర మల్లె మొగ్గలో నీ మోమును చూసాను
పడగ విప్పిన త్రాచులో నీ నీడను కలగన్నాను
నిదురను నీ కనురెప్పల ద్వారాల వద్ద కాపలా ఉంచాను
మెలుకువను నీ బాహువుల ప్రాంగణంలో నిదుర పుచ్చాను
ఎదురపడిన ప్రతి స్త్రీలో నిన్నే చూసాను
ప్రతి స్త్రీకీ పదాల ధూపంతో నీ పవిత్ర నామ స్మరణమే చేసాను
ఇల్లిల్లూ తిరిగాను, వీధులన్నిటినీ అడిగాను
పక్షుల రెక్కలపై ఆకాశానికి ఎగిరాను
పగటి రహస్యం తెలిసిన రాత్రి జాబిలినీ
రాత్రి మర్మం తెలిసిన పగటి సూర్యరశ్మినీ అడిగాను
నీవు ఉండే చోటు చెప్పమని, నిన్నోమారు
కలగానైనా, ఖడ్గంగానైనా చూపించమని
నీ శరీరపు జ్ఞాపకంతో
మొగలి పూల మోహపు అత్తరుని తయారు చేసాను
నీ హృదయపు సంజ్ఞతో
పాలరాతి మహల్లుని మించిన తపనని సృష్టించాను
నీ పెదాలతో నమాజు చేసాను, పవిత్ర పదాలను పలికాను
నీ అరచేతులకై
నా ఇంటి ముందు కన్నీటి తెరలను అల్లాను
నీ పాదాలకి వాటిని కాలి పట్టాలుగా తొడిగాను
అడిగిన ప్రతి వెధవకీ
నీవు లేని నా మొండి చేతులను చూయించాను
నెత్తురుతో నా అరచేతులను
నీ చేతులకు గాజులుగా మలిచాను
నిప్పుని అయ్యాను నీరుని అయ్యాను
నింగిని అయ్యాను గాలిని అయ్యాను
ఇరువై నాలుగు గంటల రాత్రయ్యాను
ఒక స్వపిపాసినీ స్వద్వేషినీ అయ్యాను
నీ చుట్టూతే తిరుగుతూ ఒక చితి మధుశాలనయ్యి
నీ నిండైన వదనపు
వెన్నెల మధుపాత్రకే బలి అయ్యాను, దహించుక పోయాను
ఫరీదా, యిక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే
తిరిగిన చోటూ, తిరగని చోటూ అంటూ ఏదీ లేదు-
అన్ని చోటులా ఉంటూ
కనిపించక అనుభూతమయ్యే దానివి నువ్వే అని
అల్లాహ్ కీ నాకూ తప్ప
మరింకెవరికి తెలుసు?
some thing missing..........
ReplyDeleteyes. something is missing...
ReplyDelete