25 May 2012

ఒక రోజు (నీకై 15*)

యింకా నాతో ఉన్నందుకు
కృతజ్ఞతలు- చూడు

ధూపంలా మట్టిని రేపుతూ
చల్లగా భూమి ఉపరితలంపై

సాగిపోయింది చల్లని గాలి:
చిన్నిచిన్న పరామర్శకే

లోపలి ఇసుక పొరల్లో
జలదరించి కదిలింది
ఒక సహ/ జీవ నది-

చిన్ని చిన్న తాకిడికే

నిండుగా ఒళ్లంతా విరుచుకుని
గలగలా ఆకులతో నవ్వింది
పిట్టలతో విరగబూసిన రావి మది

ఆ చిన్ని చిన్న వలయానికే

తన
చుట్టూతా తానే తిరిగి
గీతల మబ్బైన ఆకాశానికి
ఎగిరింది ఒక కాగితం ధ్వని

గాలితో పాటు గాలి కంటే
వేగంగా పరిగెడుతో పిల్లలు

జారే పోతున్నారు వాన చినుకులై
నీడలు పట్టిన రాదారులపై
హద్దు లేని /ఇకిలింతలై

వస్తునారు ఎవరో లోపలికి
దేహం గదిలోకి
తడిచిన వస్త్రాలను
విదుల్చుకుంటూ ఆరబెట్టుకుంటో

ఆ శి/ రోజాలను
తుడుచుకుంటో
సాంభ్రాణి సువాసనతో
చలిమంట మాటలతో-

యిక ఏమైనా కానీ
యిక ఏమైనా రానీ
యిక పర్వాలేదు, నిజంగా

ఎందుకంటే యిక దినానికి
ఈ ఫిరోజ్, ఆ శ్రీకాంత్
మధుశాలల్లో కాక
ఈ మధుపాత్రల్తో కాక

మనుషులలో
మనుషులతో
మత్తిల్లి స్వర్గలోకాలను చూసే వేళయ్యింది!

No comments:

Post a Comment