20 May 2012

ఎందుకు (ఆకవిత)

దారి పక్కగా
పూరె గుడిసెలో వొణుకుతుంది ఒక స్త్రీ శరీరం, ఉండుండీ మూల్గుతోంది

'మ్మా' అంటో బ్రతికుందో లేదో తెలియని చిల్లులు పడిన దశ రంధ్రాల ఆ తల్లి ప్రాణం

బయటగా
నిటారుగా లేచిన ఇనుప దిమ్మెల లోహ భవంతి

అంతే నిటారుగా అంతే లోహంతో గుడిసె లోపలోక లోహ మనిషి
తలుపులోంచి ఎర్రబారిన కళ్ళతో, మత్తుబారిన నాలికతో చీకటిని

బండ బూతులు తిడుతో
'నీయమ్మ, లంజే నోర్ముయ్' అని కసి దీరా

______________ఒకప్పటి
మెత్తటి పచ్చిక వంటి తన కడుపుని తంతో తనూ వణుకుతాడు
________తనూ తూలి చేజారి పోతాడు, నా వైపోసారి అసహ్యంగా చూసి
దిగంతాల నిస్సహాయతనంతా నాపై ఉమ్మేస్తాడు-

నక్షత్రాలు లేని గూటిలో
మోగుతున్న నక్షత్ర ప్రసారాల ముందు ఆ ఇద్దరు పసి పిల్లలే కడుపుని చేతబుచ్చుకుని

కనులని
తుడుచుకుని ఎండకి చిట్లిన చేతులపై ఆరని పుండ్లని గిల్లుకుంటూ
ఎందుకో నవ్వుతారు పడీ పడీ, ఎందుకో ఏడుస్తారు ఆగీ ఆగీ ఎందుకో స్పృహ
___తప్పుతారు, తప్పిపోతారు రాత్రుళ్ళ అంచును చీరే చిరు కాగితాలలోకీ కలలలోకీ -

కమిలిన రక్తం
కమిలిన దేహం
కమిలిన ప్రాణం
కమిలిన కాలం
కమిలిన లోకం

కమిలీ కమిలీ కమిలీ యిక కమల లేక యిక కాలలేక ఆగిన వేసవి గాలి కింద
ముడుచుకుంటాయి రెండు నల్ల వీధి కుక్క పిల్లలు
కొంత సేపటి తరువాత చెల్లా చేదురయ్యే పేగులతో,
వేల జన్మల ఆర్తితో యిక రాత్రంతా ఊళ పెడుతూ ఏడ్చే తల్లి తనపు ఆక్రందనతో-

అయితే ఇంతకూ
ఎవరు చెప్పారు మీకు ఇదొక కవితని

యింకా ఎందుకు ఉన్నారు మీరు యిక్కడ నిసిగ్గుగా
_తిరుగుతో కనులతో తడుతూ వాచకపు తనువుని?

2 comments:

  1. ఇది కవిత కాదు......దృశ్యం......భాదాతప్త హృదయ.......... హిమోహసదనం...

    liked it...!

    ReplyDelete