16 December 2015

of love

"there is no love.
It's fake. It's a fraud. It's just a fucking lie."
She said.

ఆ చీకట్లో
నేను నా దుస్తుల కోసం, నా చర్మం కోసమూ వెతుక్కుంటూ
ఉంటే

తన గొంతు 
కాళ్ళు కట్టేసిన ఒక పావురం ఎగురలేక విలవిలలాడుతూ
రెక్కలు


కొట్టుకుంటున్నట్టుగా
ఆ రాత్రిలో నన్ను కోసుకుంటూ దాటుకుని వెళ్ళిపోయింది.
నాకు తెలుసు:

జీవితంలో
ఖాళీ అరచేతులూ, కళ్ళూ మాత్రమే మిగిలిన వాళ్ళు, ఇక
చేయగలిగిందల్లా

ప్రార్ధించడం మాత్రమే
అనీ, ఇరు శరీరాల శిధిల శరణాలయాలలో ఒకరి ఎదురుగా 
మరొకరు

మోకరిల్లి
వేడుకోవడమేననీ: ఒకరి బాహువుల వలయంలో మరొకరు
ఉరి వేసుకోవడమేననీ - 

ఆ విషయం తనకీ
తెలుసు. నాకూ తెలుసు. బహుశా నీకూ తెలుసుండవచ్చు -
అందుకని

నేను ఏమీ మాట్లాడలేదు.
తన ముందు విప్పేసిన లోక చర్మాన్ని తిరిగి తొడుక్కుని
ఇంటికి

వెడుతూ తన గదిలోని
కిటికీ తెరిస్తే, ఎదురుగా చీకట్లో ఆకులకి ఊగిసలాడే వాన 
చినుకులు -

కొన్ని అంతే: రాత్రిలో
ఆకులని అంటి పెట్టుకుని అట్లా ఊగుతూ ఉంటాయి
తమని తాము

నిభాయించుకుంటూ
ఇతరుల ముందు ఎప్పటికీ రాలిపడకుండా, చిన్నగానైనా

14 December 2015

వేళ్ళకు అంటిన నీళ్ళు

నువ్వు చూసి ఉండవు: గాలికి
తెరచి ఉంచిన ఒక పుస్తకపు పుట ఏదో మరలినట్టు, తను ముఖం
తిప్పుకున్నప్పుడు

వేగంగా పూలతోటల మీద
వ్యాపించిన నీడలని. పైన, గుమికూడిన కారు మబ్బులనీ, లేచిన
ధూళినీ -

కళ్ళల్లో దుమ్ము పడకుండా
నువ్వు చటుక్కున చేతులు అడ్డం పెట్టుకుని ఇంటి దారి పట్టావు
కానీ, అక్కడే

నుల్చుని ఉండిపోయింది నీ తల్లి
వణుకుతున్న చేతులతో, రాలి నేలపై దొర్లిపోయే ఎండిన ఆకులని
చూస్తూ, నెమ్మదిగా

మొదలయ్యిన జల్లులో
ఆరేసిన దుస్తులు తీయడం మరచిపోయి, అట్లా తడచిపోతూ ఏదో
గొణుక్కుంటూ -

ఆనక, ఇక నువ్వు ఇంటికి వచ్చి
ఒక కవిత్వం పుస్తకం తెరిచి, నాలుగు వాక్యాలేవో రాసుకుని, వేలితో
చాలా యధాలాపంగా

పుటను తిప్పితే, నీ వేళ్ళను
వదలకుండా అంటుకున్న అశృవులూ, నీ నాలిక పైకి పేగు తెగిన
నెత్తురు రుచీ

ఎక్కడి నుంచి వచ్చాయో ఇక
నీకు ఎప్పటికీ అర్థం కాదు -

13 December 2015

ఆరనివి

"నన్ను మర్చిపో.
అది ఎంత కష్టమైనా" అని చెబుదామని అనుకుంది తను
ఆనాడు -

మరొక మధ్యాహ్నం: 
కుదిపి వేసే చల్లటి గాలికి కంపించే పూలూ ఆకులూ లతలూ 
తనలోపల 

తేమ నిండిన ఇల్లు. 
ఖాళీతనంతో నీడల సాంద్రతతో మోయలేని బరువుతో మరి 
గోడలు -

ఇక ఇంటి వెనుక 
తను తీగపై ఆరేసుకున్న దుస్తులలో ఒకటి మరొక దానితో  
మిళితమై 

ఎన్నిసార్లు ఉతికినా 
పోని ఎరుపు రంగుతో మబ్బుల ఆకాశం కింద ఇంకా ఆరక
పచ్చిగా 

అట్లా ఊగుతా ఉంటే
  
మరి ఇది శీతాకాలమనీ
త్వరగా ఏవీ ఆరవనీ, కనుచూపు మేరలోనే సాయంత్రమూ
మరొక రాత్రీ 

వేచి ఉన్నాయనీ
ఎవరు చెబుతారు
తనకు? 

11 December 2015

ఒక్క క్షణం కోసమైనా

నీకు తెలుసు స్పష్టంగా
నీతో చివరిదాకా ఎవరూ ఉండబోరని, నీ హృదయం ఒక తల్లి అనీ
పిచ్చిదనీ -

సాయంత్రపు గగన కాంతి.
శరీరాన్ని  ఊదే గాలి. రెపరెపలాడే ఆకుల్లో ఒక గుండె కొట్టుకునే
సవ్వడి -

ఇక ఏ ఎదురుచూపూ లేదు.
సజ్జలూ, జొన్నలూ వేసే అరచేయి ఒకటి ఖండితమయి పోగా
కుండీల వద్ద

ఇష్టమైన మనిషికై నీడలలో
అక్కడక్కడే తచ్చాట్లాడుతూ వెదుక్కునే ఒక పావురపు పరిస్థితి.
అది నువ్వు కూడా -

స్పష్టంగా తెలుసు నీకు:
నీతో కడవరకూ ఎవరూ రారనీ, నీతో చివరి వరకూ ఎవరూ ఇక
ఉండరనీ -

అయినా కుండీల వద్ద
రాలిన చినుకుల్లో, చినుకుల్లో చిక్కి ఊగే రాత్రిలో, రాత్రి చీకటి
హింసల్లో

నీ కళ్ళల్లో, ఒక చిన్న
ఆశ. ఒకవేళ ఎలాగోలాగా ఎవరో ఒకరు వచ్చి నిన్ను తాకితే
ఒక మాటై

నిన్ను అల్లుకుపోతే
ఒక శ్వాసై నిను వేణువుని చేసి ఊదితే, ఒకే ఒక్కసారి నిన్ను
గట్టిగా హత్తుకుని

నువ్వు బ్రతికే ఉన్నావని
చెబితే, నీలో బీజాక్షరాలు రాస్తే, నువ్వు పిచ్చిదానివి కాదని
నమ్మకమిస్తే

నీతో క్షణకాలం నవ్వితే
ఏడిస్తే, నీతో నడిస్తే, నిను ఖండించక ప్రతీకించక కనీసం
ఒక్కసారికైనా

కనీసం ఒకే ఒక్క క్షణం కోసమైనా
అట్లా ఉంటే
అట్లా ఉంటే
అట్లా ఉంటే
అట్లా...

09 December 2015

ఎంత రాత్రయినా

"అట్లా ఉండకు
ఏదైనా మాట్లాడు. ఏదో ఒకటి... ఒక్క మాట" బేలగా
అతను  -

గాలికి కొట్టకుని కొట్టుకునీ
మూసుకు పోయిన కిటికీలు తెరుచుకోవు. వాటి అద్దాలపై
చెమ్మ -

(కానీ నీకు తెలుసు
అవి తన కళ్ళని)

చిక్కటి నీడలేవో
గోడలపై: నేలంతా, పగిలి చెదిరిన గాజుపాత్ర ఆనవాళ్లు
పాదాల్లో-

(కానీ నీకు తెలుసు
అవి నెత్తురు పొటమర్చిన పూల పాదాలనీ, వాటి చిన్ని
ముఖాలనీ)

తెగిన లతలు:
పిగిలిపోయిన గూడు. చితికిన గుడ్లు. చినుకు చినుకుగా
వెక్కిళ్లు
గదిలో -

"ప్లీజ్ డోంట్ క్రై" అని
తనతోనూ, పిల్లలతోనూ అనాలని ఆగిపోతాడు అతను
ఎందుకో-

(కానీ
తెలుసా నీకు
తల్లి చూచుకం నుంచి లాగివేయబడిన శిశువు స్థితి, వేదనా
తనదని, ఆ
తనదనీ?)

బహుశా తెలియదు
ఎవ్వరికీ ఎన్నడూ, ఎంత రాత్రయినా మన కోసం ఒక దీపం
మరెక్కడో

ఇంకో హృదయంలో
అట్లా వెలుగుతూ ఎదురుచూస్తూ
ఉంటుందని!

03 December 2015

స్థితి

నువ్వు తిరిగి వచ్చేసరికి పగిలిన ఒక పూలకుండీలా ఇల్లు: చెదిరి, ఆవరణ అంతా ఆకులతో అట్లా మట్టితో -

మసక బారిన కాంతిలో ఇంకా స్కూలు దుస్తులు విప్పని పిల్లలు: మధ్యాహ్నం తినకుండా అలాగే తీసుకు వచ్చిన బాక్సులతో ఆకలికి కుంచించుకుపోయిన ప్రమిదెల వంటి ముఖాలతో బేలగా ఒక మూల అట్లా ఆడుకుంటో -

చల్లగా వీచే గాలి. శీతాకాలం: ఇక వాకిలికి తను ఎన్నడో వేలాడదీసిన గంటలేవో గాలికి కదిలి మ్రోగితే అతి నెమ్మదిగా వ్యాపించే చీకటి: నీ లోపల తలలు వాల్చే మొక్కలు. గూళ్ళలో అక్కడక్కడే మెసిలే పక్షులు: పగుళ్ళిచ్చిన గోడల్లో అల్లుకుపోయే చెమ్మ. నీ లోపల ఏదో కోసుకుపోతున్నట్టూ, ఎవరో లీలగా ఏడుస్తున్నట్టూ, ప్రాధేయ పడుతున్నట్టూ నిరంతరం ఒక రంపపు ధ్వని. ఇక 

నీ లోపల పగిలిన ఒక పూలకుండీతో నువ్వు ఇంటికి తరిగి వచ్చినప్పుడు, వొణికే చేతులతో తల్లి లేని పిల్లలు నీ వైపు బెంగటిల్లిన కళ్ళతో భీతిగా - చలికి చిట్లిన పెదాల మధ్య పొటమర్చిన నెత్తురు చుక్కలతో నీళ్ళు లేని మొక్కలయీ పక్షులయీ చెమ్మగిల్లిన గోడలయ్యీ ఎవరూ పలుకరించని మాటలయ్యీ హృదయాలయ్యీ

చివరికి నువ్వయ్యీ, నీ వైపు అట్లా దిగులు దిగులుగా చూస్తో -

02 December 2015

క్షణం

ఎలా
గడచిపోయిందో కాలం: అంత త్వరగా -

శీతాకాలపు రాత్రి.
చలించే నీడలు. తెరలు తెరలుగా కోసే గాలి. రాలే పసుపు
పూలు -

నీ అరచేతిలోంచి
నీ పిల్లవాడి వేలు చేజారి పోయినట్టు లోపంతా ఖాళీ. బెంగ.
నొప్పి -

ఏం చేయాలో
తెలియని బెదురు. భయం. అలసట. లతలు తెగిన దిగులు.
కంపన -

ఎలా
గడచిపోయిందో కాలం అంత త్వరగా
మరి తెలియదు

ఎప్పటికీ మనకు -
ఇక అంతిమంగా వెనుదిరిగి చూసుకుంటే, ఎక్కడో
మనం

ఎప్పటికీ చేరలేని దూరాలలో
శోకతప్త హృదయంతో ఇంటికి దారి వెతుక్కుంటూ ఈ లోకపు
సంతలో

నీ నుంచి తప్పిపోయిన
ఒక పిల్లవాడు!  

01 December 2015

రాత్రంతా

రాత్రంతా కూర్చుని చూసాను, నిదురోయే
నీ చిన్ని ముఖాన్ని -

గదిలో మెత్తగా నీ శ్వాస. వర్షపు గాలి. వానకు వాలిన
పచ్చిక వాసన. ఇక సగం తెరుచుకున్న నీ నోరు
రాత్రి ఒడ్డున మెరిసే ఒక గవ్వలా -

రాత్రంతా కూర్చుని చూసాను, నిదురలో ఏవేవో
కలవరించే చక్కటి
నీ బుజ్జి ముఖాన్ని -

సముద్రపు శాంతీ, నక్షత్రాల కాంతీ, జీవన క్షణాల
రహస్యమూ, విస్మయమూ అప్పుడు నాలో:
నిద్దురలో నీవు పలికిన పదాలు

ఈ చీకట్లో మిణుగురులై నాలోకి నాకు దారి చూపుతో
మెరసిపోయినప్పుడు - 

27 November 2015

రెండే రాళ్ళతో

రెండు రాళ్ళు ఏరుకుని నీ పక్కగా కూర్చున్నాడు నీ పిల్లవాడు -

ఒకదానితో మరొకదానిని మ్రోగిస్తూ ఒకదాని తరువాత మరొకదానిని ఎగుర వేసి పట్టుకుంటూ ఒకదానితో మరొకదానిని కొట్టుకుంటూ అట్లా సమయం గడుపుతూ -

ఈ లోగా సాయంత్రం అయ్యింది. చీకటీ పడింది. ఎక్కడో దూరంగా గుడిసెల్లో దీపం వెలిగింది. చల్లటి గాలి రిఫ్ఫున వీచి వెళ్లి పోయింది. శరీరం వణికింది. పక్షుల రెక్కల కింద రాత్రి సద్దుమణిగింది. అలసట, కట్టెల పొయ్యిలోంచి ధూపం వలే లేచి నిదుర నయనాలతో కమ్మేసింది. ఎందుకో మరి గుబులయ్యింది. లోపలేదో బావురుమంది -

రెండు రాళ్ళు ఏరుకుని నీ పక్కగా కూర్చున్నాడు నీ పిల్లవాడు - 

పాపం: ఒక్కడే. రెండు రాళ్ళతో.
ఒక నువ్వు ఒక నేను అనే 
రెండే రెండు రాళ్ళతో!

26 November 2015

ప్రశ్న

"ఎలా ఉన్నావు? She asks

I think over
and say:

"Like a whisper

Like a whimper
And like, పొంగి పొర్లే జ్వరంతో
నిద్దురలో

నీ పిల్లవాడు పెట్టే
కలవరింతలా
ఇంకా..."

"Shut up 
You idiot" She says

I giggle
And the poem 
ends
this
way.

23 November 2015

చెట్ల కింది గాలి

తను లేవదు అక్కడ నుంచి
అలాగే అక్కడ ఆ గదిలో చాలా సేపు, అతను తేలికగా అనేసి వెళ్ళిపోయిన
మాటలతో -

రాత్రి: చీకటి. ఎవరి కోసమో
ఎదురు చూసీ చూసీ, తలుపు తట్టినట్టయ్యి పరిగెత్తుకు వెళ్లి చూస్తే అక్కడ
ఎవరూ లేనట్టు

జీవితం. తన ముఖం.
పొడుచుకునీ పొడుచుకునీ పక్షుల ఈకలన్నీ నెత్తురుతో చెల్లాచెదురైనట్టు
ఇల్లు -

తన వొళ్ళు. ఇక కళ్ళు
తెరవని ఒక పక్షిపిల్ల ఏదో ఒకటి అక్కడక్కడే ఎగురాలేకా అరవలేకా రాత్రి
చలిలోకి

గడ్డ కట్టుకుపోయి
"అమ్మా ఆకలి" అని పాప అంటే ఇక ఎప్పటికో నెమ్మదిగా లేచి కళ్ళూ
ఇల్లూ

తుడుచుకుని
పొయ్యి వెలిగించి కిటికీలు తెరిస్తే ఎక్కడో దూరంగా చుక్కలు. పల్చటి
పొగమంచు

మరలిపోయే చినుకులు -
తనకి దూరంగా ఎక్కడో పగలంతా గాయపడి, ఇక రాత్రికి నెమ్మదిగా
స్థిమిత పడే

రావి చెట్ల కింది సన్నటి గాలి.  

21 November 2015

స్మృతి

సాంధ్య సమయాన 

ఒక స్మృతి  ఏదో నీలో:
నెలలు నిండని కడుపులోని బిడ్డ హటాత్తుగా కదిలినట్టూ కలవరపెట్టినట్టూ
ఇక అక్కడే

ఆయాసంతో కూలబడి
నువ్వు ఆ చల్లటి గాలిలో పల్చటి చీకటి తెరలలో పొట్టపై చేయి వేసుకుని
జలదరింపుతో

దూరంగా ఒక ఇంటిలో
మిణుకు మిణుకుమనే దీపపు కాంతిని తదేకంగా చూస్తూ మిగిలినట్టూ
ఒక స్మృతి ఏదో
నీలో 

ఉగ్గబట్టిన నొప్పైతే

ఇక
ఆ పూటంతా నీలో
సగం అల్లిన స్వెట్టర్ వాసన. పాత దుప్పటి ముక్కలతో ఇష్టంగా
చేసిన

ఒక చిన్న పరుపు -
నువ్వు జాగ్రత్తగా ఎంపిక చేసుకుని కొనుక్కుని వచ్చిన చిన్నచిన్న
బొమ్మలూ

అల్లుకున్న ఓ ఊయలా
చలించే నీ మట్టి గాజుల శబ్ధంతో, నీలో కదిలే నీటి చెలమల అలికిడితో
అట్లా

నిరంతరాయంగా

ఊగుతూ
ఊగుతూ
ఊగుతూ - 

20 November 2015

మాట

రాత్రి -

మూసిన కిటికీలతో
ఇల్లు: సాయంత్రం గడప ముందు బెంగటిల్లిన కళ్ళతో ఎదురుచూసే
ఓ పాపై -

ముసురు -

మరెక్కడ నుంచో
నింపాదిగా అవిసె చెట్లపై నుంచి వీస్తో పల్చటి పొగై నీలోకి వ్యాపించే
మంచు:

సమయం -

ఎవరినో స్మరిస్తూ
నీ బల్లపై వెలిగించని దీపం వద్ద నిస్త్రాణగా వాలిపోయిన రెండు అర
చేతులు -

(ఆ) తరువాత -

అవును. నువ్వు
ఊహించిందే నిజంమసి పట్టిన బుగ్గలతో ఎండిన నీటి చారికలతో
విరిగిన

ఒక బొమ్మని
గట్టిగా హత్తుకుని ఎదురుచూసే ఆ పాప వద్దకు రాలేదు ఎవ్వరూ
వడలిన

ఆ పూరేకును
చిన్నగా తమలోకి పొదుపుకుని - ఒక జోలపాటై ఒక తల్లి మాటై -
మెత్తగా

పలుకరించేందుకు!

14 November 2015

మంచు

నిదురించే ముందు
చాలా జాగ్రత్తగా, తలుపులన్నీ గడియ వేసి ఉన్నాయో లేవో అని చూసి వస్తుంది
తను -

గదిలో ఒక దీపం.
దీపపు వెలుగులో వస్తువులూ, మంచంపై ఫాను రెక్కల నీడలూ, అమర్చిన దిండ్లూ
తెరవని దుప్పట్లూ -

"You can rest
now. These are the little things that make us live: for one more day.
What can we do?

చింతించకు -
దా ఇట్లా. నిద్రపో నాలో
కొంచెంసేపు" అని అంటుంది తను. ఇక గాలిలో రాలుతున్న పూలతో చెబుతున్నట్టు
తనలో తాను

గొణక్కుంటూ
లేస్తాడు అతను: "the world
Is a word and a door that no one knocks anymore." అని అనుకుంటూ -
ఇక ఆ తరువాత

పడక గదికి ఆవలగా
రాత్రంతా మసక కాంతిలో, డైనింగ్ టేబుల్పై, తెరచిన బాల్కనీ కిటికీలలోంచి వీచే
చల్లని గాలికి
వొణికే

గాజు పాత్రలోని
రెండు పూలూ, అన్నం పాత్రల్లోనూ పింగాణీ పేట్లపైనా చేరే చెమ్మా, మెత్తని దుమ్మూ
అతని హృదయంలో నెమ్మదిగా
గుమికూడే

నువ్వు ఎన్నడూ చూడని
చూడలేని
రాత్రి మంచు -

లేదు

రాత్రి స్వప్నం:
నీ హృదయంలో, నీ అనుమతి లేకుండా వచ్చి ఎవరో ఆర్పిన దీప
ధూపం -

స్వప్నకాలం:
శీతాకాలపు గాలుల్లో, రాలే ఆకుల్లో, మరెవరి చేతుల్లోనో నలిగే
నీ శరీరం -

కాల గమనం:
నేను స్వప్నించలేదు దీనిని: నువ్వు వ్రాయలేదు దీనిని. కానీ
నిన్న

నేల రాలిన
నువ్వు గూడు అవుదామని అనుకున్న, ఇంకా కళ్ళు తెరవని
ఒక పావురం పిల్ల
ఏదో

ఈ పూట
ఇంకా అక్కడే మిగిలి లేదు -

13 November 2015

ప్రార్ధన

గాలి -

నా శ్వాసలోంచి
పూచే నీ రాత్రి: నీలోంచి ఎగిరి వచ్చి నన్ను నింపే ఒక
పూల తావి -

చూపు -

నీ శరీరంలో తేలే
నా వేకువ నావ: నీలోంచి ఎగిరి వచ్చి నన్ను నింపే ఒక
అత్తరు కల -

బ్రతుకు - 

మన మధ్య వొణికే
ఒక రహస్య దేహ దీపం: స్పర్శ. గుమికూడే నీడలూ కోరికా
చీకటీ విచిత్రం

ఒక గగుర్పాటూ
మనం: అవిభక్త కవలలం, పరస్పర పరిమళం: మనం. ఇంకా 
అతనూ
ఆమె -

ఇక - అందుకని
పట్టించుకోకు నువ్వు ఎవ్వరినీ: మరణించేందుకు మనకు
వేళ ఇక

ఎవ్వరి పదాలూ
అవసరం లేదు -

amen

12 November 2015

4


1.

శీతాకాలపు వెన్నెల: గాలి చుక్క -
కొమ్మల్లో మెసిలే
పసి రెక్కలు -
2.
దారిలో
నీడలు: చెట్ల కింద వడలిన ఆకులు.
స్నేహితుడా

మరి
నీ ముఖమే గుర్తుకు వచ్చింది
కొమ్మకి ఊగిసలాడే ఒక
తడిచిన గూడును
చూస్తే -
౩.
శీతాకాలపు చీకటి: రాత్రి తాకిడికి
నేలకు మోకరిల్లిన
ఒక గడ్డి పరక -
మంచు
4.
ఇక
నీళ్ళల్లో
ఎక్కడో నీ కళ్ళల్లో చెదిరిన ఒక
చంద్రబింబం -

ఎవరన్నారు
నేను నీలా ఒంటరిని
కానని? 

పిలుపు

పదం -

నెత్తురులో ఒక పదం: నువ్వు
పదం నెత్తురై ఒక మొగ్గై  పుష్పించే మంచుగులాబీ పూవువి   
నువ్వు  

వాక్యం -

ఎందరివో కన్నుల పవిత్ర జలం:
నువ్వు. వాళ్ళ హృదయాలలో లంగరు వేయబడి అలా తేలికగా
ఊగే

లయబద్ధమైన శ్వాసవి
నువ్వు -

అంతం -

ఇక 
దినానంతాన 
నీలోనూ నీ పదాల మధ్య నిశ్శబ్ధంలోనూ పూర్తిగా మునిగి 
ఒక దివ్యకాంతిలో 

కనుమరుగయ్యెను 
అతను -

ఇంతకూ 
శ్రీకాంత్ అనేనా 
నువ్వు అతనిని, కపోతాలు కలకలంతో నింగికెగసే వేళల్లో 
తడబడుతూ 
పిలిచినది? 

11 November 2015

రహస్యం

దారి -

లేతెండ:
చెట్ల నీడల్లో నిమగ్నమయి ఒక సీతాకోకచిలుక
నువ్వు -

అప్పుడు

గాలి -

పచ్చికలో
నీ శ్వాస. నీ శ్వాసలో తన నయనాల తడి. చూడు:
రమ్మని నిన్ను
చిన్నగా

పిలిచే
ఎవరో -

(ఇక )
గూడు

నీ దోసిళ్ళలో
పుష్పించే తన దేహదీపం: ఒక మృత్యు సుగంధం -
జ్ఞప్తికి తెచ్చుకో
మళ్ళా ఒకసారి

నిన్ను
నువ్వు -


నువ్వు వెళ్ళాల్సినా
చివరి దారి
ఇదే -

10 November 2015

వివర్ణం

విస్మృతి -

తన వేలితో తాకబడిన ఈ రాత్రి చెలమలో - పూలవర్ణాలు. ఇక 
ఎవరిదో శ్వాస అతని నయనాల్లో 
చంద్రబింబమై -

స్మృతి - 

ఎవరిదో ఒక మాట ఈ చెట్ల మధ్య వేణువై, వెదురు వనాల 
పరిమళమై,వొణికే తన అరచేతుల్లో 
ఒక ప్రమిదెయై -

మెలకువ -

ష్: నిశ్శబ్ధం. మాట్లాడకు: గుర్తుకు తెచ్చుకుంటున్నారిద్దరూ  
వెన్నెల రంగుల వేణుగానాన్నీ ఒక 
దీప దాహాన్నీ!

28 October 2015

grace

నువ్వు వచ్చి వెళ్లిపోయావని 
తెలిసిపోతూనే ఉంటుంది: నేను భద్రతతో మూసిన కిటికీలు 
తెరచి ఉండటంలో - 

అప్పుడిక గదుల్లో 

నేలపై తార్లాటలాడే గాలిలో చెట్లు తడచిన నీ కురుల వాసన: 
పెరట్లో ఆరేసిన తువ్వాలుపై నీ దేహ దీపకాంతీ 
పొగ: ఇంకా సుదూర శబ్ధాలేవో -

ఆ కాంతిలో, ఆ పొగలో 

నువ్వు వొంపిన నీళ్ళతో తిరిగి బ్రతికిన మొక్కలూ, పూలూ 
పిట్టలూ, కీటకాలూ, చివరిగా, మన నాలుగు 
గోడలూ, నీడలూ, నేనూ -

నువ్వు వచ్చి వెళ్లిపోయావని 

తెలిసిపోతూనే ఉంటుంది: నువ్వసలు నాకేమీ చెప్పకపోయినా - 
సరిగ్గా ఎలా అంటే 

వాన వెలిసిన దారిలో  

పురాస్మృతుల్లో నడుస్తూ ఒక మనిషి, చీకట్లో చెట్లు వణికి
రాల్చిన జల్లుకి జలదరించి, సుషుప్తిలోంచి 
ఇప్పటిలోకి మేలుకున్నట్టు -        

25 October 2015

విశ్రాంతి

నా నుదుటిన 
నీ అరచేయిలా కురిసిన రాత్రి: పూరేకుల వంటి 
చల్లటి గాలి -

గూటిలో కపోతాలు  
సవ్వడి లేకుండా విశ్రమించిన రాత్రి: మెత్తని 
చీకటి శాంతి - 

ఇక 
నాకు తెలుసు 
ఇక్కడే ఎక్కడో నువ్వు, నాకు చాలా దగ్గరిగా 
దాగి ఉన్నావని. 

ఇంద్రజాలం

ఏదో వివరణ ఇచ్చుకోబోతాను నీకు
ఒక సంజాయిషీలా -

"ష్" అని పెదాలు మూసి "ఇక పడుకో"
అని నువ్వన్నప్పుడు
నాకు తెలుసు: ఇక రాత్రికి నేను తప్పక
మొగలిపూల వాసన వేసే
లేతెరుపు సీతాకోకచిలుకలని
కలగంటానని -

మరి ఇంతకూ
రాత్రిని వెదురు వనాలలోని గాలిలా మార్చి
ఇతరుల కలలోకి పంపించే
ఆ ఇంద్రజాలాన్ని

ఎవరు నేర్పారు నీకు?

24 October 2015

మొగ్గ

అంటావు ఒక మాటను నువ్వు
ఎంతో తేలికగా, నిర్లక్ష్యంగా: ఒక మొగ్గను యధాలాపంగా తుంపి పక్కకి
పడవేసి కాలితో నలిపినట్టుగా, ఏమీ తెలియనట్టుగా -

తెలియదు నీకు బహుశా ఎప్పటికీ
ఒక మొగ్గ ఎన్ని లోకాలును పూయించగలదో, ఎన్నెన్ని రంగులని అది
కనులలోకి స్వప్నసువాసనలతో వెదజల్లగలదో -

అంటావు ఒక మాటను నువ్వు
ఎంతో తేలికగా, కరకుగా: పూతొడిమలోకి నెమ్మదిగా సూది గుచ్చినట్టుగా
మహా చవకబారుగా, "ఏం చేయగలవు నువ్వు?"

అని అన్నట్టుగా, వెకిలిగా ఊసినట్టుగా
లజ్జారహితంగా, నీలోని మానసిక వైకల్యాన్ని కప్పిపెట్టుకుంటున్నట్టుగా
భయంగా, మొండిగా, మరింత అసహ్యంగా -

నువ్వన్నట్టే నిజానికి ఏం చేయగలను నేను?
వెళ్ళేపోతాను నాతో నేను, ఒక మొగ్గను గుండెకు హత్తుకుని, దాని పసి
భాషని శోకతప్త హృదయంతో వింటో, వ్రాస్తో

బదులిస్తో - నీకు దూరంగా - నాకు మరింత దగ్గరిగా నేను!

22 October 2015

వ్యక్తీకరణ

"ప్రేమ అని 
ఒక్క మాట, ఆ ఒక్క మాట ఎందుకు పలకవు నువ్వు?" అని అతనిని  
అడిగింది తను

తల ఎత్తలేదు అతను
తన చంచల నయనాలనూ తన చేతులనూ తన పాదాల వద్ద నడయాడే 
నీడల్లో చూస్తో: మరి నీడల్లో

అతను చూడని వాటిల్లో
చెమ్మ: చీకట్లో ఆకులు కొద్దిగా కదిలి, రుద్దుకుని, అతని భుజంపై వాలిన 
ఒక ముఖంపై మంచై రాలినట్టు -

"ప్రేమ: ఆ ఒక్క మాట
ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఎందుకు చెప్పవు నువ్వు?" అని అతనిని 
పట్టుకుని ఏడ్చింది తను - 

ఇక ఆ తరువాత 
మిగిలిన చీకట్లలో, వాన వెలసిన నిశ్శబ్ధంలో, సన్నగిల్లే వెక్కిళ్ళయ్యి
రాత్రంతా గోడవారగా జారే 

ఒంటరి వాన నీళ్ళు. 

ఆర్ద్రత

నువ్వేమీ మాట్లాడవు. కానీ
చీకట్లో గాలికి మల్లెపందిరి జలదరించినట్టు నా చుట్టూ ఒక సువాసన. 
ఒక భరోసా -

నేను కూడా ఏమీ మాట్లాడను
చీకట్లో మల్లెపందిరి కింద తచ్చాట్లాడీ తచ్చాట్లాడీ, ఇకక్కడే కుదురుకునే 
ఓ పిల్లిలాగా - 

మరి ఇక పదాలు ఎవరికి కావాలి
చీకట్లో - రాత్రి వంటి నా నుదుటిపై నీ చేతివేళ్ళు మల్లెపూలై, నెమ్మదిగా 
రాలి విశ్రమించాక? 

21 October 2015

అర్హత

ఇక గది అంతా 
అప్పుడే ఊడ్చిన శుభ్రతతో, ఉదయపు కాంతితో దయతో 

సర్దిన 
వాటన్నిటిలోనూ 
ఆకుపచ్చనిదనం. అలలుగా ఆకులు కదిలే సన్నటి అలికిడి. గాలి. నేలపై 
నీరు నవ్విన మెరుపు. సుగంధం. ఇష్టం ~ 

ఇక ఇల్లేమో 

ఒక గూడుగా మారి, మెడల కింద ముక్కులతో పొడుచుకుంటూ పిట్టలు
ఆ గూటిలోంచి గూడు గురించి నీకేదో విడమర్చి 
చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు ~ 

సరే. గది అంతా 

అప్పుడే ఊడ్చిన ఆనందంతో, జీవన ఉత్సాహంతో, క్షమతో 

ఇక 
మంచం దిగుతూ అతను 
ఇలా తలపోస్తాడు: "నన్ను శుభ్రపరచే రెండు చేతుల అర్హతను మరి నేను 
ఎన్నటికని సంపాదించుకోగలను?"

19 October 2015

హక్కు

ఒక చినుకంత నిద్ర
అది మాత్రమే నువ్వు అడిగినది, నీ ముఖాన్ని అలసటగా
నా ఛాతిలో కూరుకుంటూ -

రాత్రి:
ఆకులపై మెరిసే చీకటి.
ఉండుండీ వీచి నిన్నూ నన్నూ దిగ్బంధనం చేసే చల్లటి గాలి:
చెమ్మ. మట్టిపై పల్చటి కాంతి -

గుబురు కుండీల మధ్య

ఒక సన్నటి అలజడి: మన మాటల్లా, మన నిస్సహాయాతల్లా
మన కోరికల్లా. మన మూర్ఖత్వాల్లా -

ఒక చినుకంత నిద్ర
మరి అది మాత్రమేనా నువ్వు అడిగినది, నిన్ను నువ్వు నాలో 
కూరుకుంటూ?

18 October 2015

కిణ్వనం

ఎవరికీ తెలియకుండానే గడచిపోయింది 
మరొక పగలు. 

తన దరికి చేరగానే

గుబురు పూల మధ్య నుంచి ఎగిరిపోయిన 
ఒక సీతాకోకచిలుకలా. 

ఇక

దాని పాదాలు తాకిన  ఒక లేత ఆకై 
సన్నగా కంపిస్తుంది 
నీ హృదయం. 

ఎవ్వరికీ  

తెలియకుండానే గడచిపోయింది ఈవేళ 
మరొక పగలు. 

ఇక రాత్రంతా 

నువ్వు తనకి దగ్గరికి జరిగినప్పుడల్లా, నీకు 
దూరంగా మరలిపోతూ 
ఒక వర్షం. 

16 October 2015

అలాగే

అలాగే వచ్చావు నువ్వు

గది లోపలకి  
బడ బడా కొట్టుకునే కిటికీ శబ్ధాలలోంచీ, లోపలికి పడే జల్లులోంచీ
జిగురువంటి చీకటిలోకి    
మసి పట్టిన ఓ  
దీపం వద్దకు  

ఒక 
అగ్గిపుల్లను వెలిగించుకుని 
హోరున వీచే గాలికి ఆరిపోకుండా రెండు అరచేతుల మధ్య 
దానిని పదిలంగా దాచుకుని  
వెలిగించడానికి దానిని
చిన్నగా 
ఓపికగా 
ఇష్టంగా - 

మరి వెళ్ళిపోయావు అలాగే నువ్వు
గది బయటకి 

దీపపు 
అంచు దాకా వచ్చి, వెలిగించకుండా ఆగి, ఏదో తలంచి, 
అన్యమనస్కంగా ఆఖరి నిమిషంలో   
వెలిగే దానినేదో 
ఆరిపి వేసి

ఒక్క క్షణం 

అక్కడే నుల్చుని, కళ్ళు తుడుచుకుని, ఆపై వెనుదిరిగి నెమ్మదిగా
చాలా మాములుగా యధాలాపంగా  
అక్కడ నుంచి 
చీకట్లోంచి 
చీకట్లోకి - 

15 October 2015

నోట్

ఎక్కడో చూసాను నిన్ను. అది ఏ దారి?

యిక ఇప్పుడు నిన్ను గుర్తుపట్టలేను~
ఇసుకను పొద్దుతిరుగుడు పూవు సవరించే వేళల్లో
కలిసి ఉంటాను నిన్ను. అందుకే ఇప్పటికీ
నువ్వు నన్ను దాటుకుని వెళ్ళినప్పుడల్లా
నా చుట్టూతా ఒక సరస్సు విరిసిన వాసన

అందుకే ఇప్పటికీ రహదారుల్లో నిన్ను పోలిన వేనవేల మనుషులు
తాకుతుంటారు నన్ను, ఒక్కోసారి నవ్వుతుంటారు

ఎర్రటి మట్టిలో పాదు చేసి, మొక్కని నాటి నీళ్ళు పోసి
ముంజేతితో నుదిటిని తుడుచుకుంటూ, చేతివేళ్ళు
మెత్తగా దిగిన నేలను తృప్తిగా చూసుకున్నట్టు
అటువంటి రకరాకాల మనుషులలో తారసపడతావు నువ్వు
ముచ్చటగా చూసుకుంటాను నేను-

పనికట్టుకుని ద్వేషించే వాళ్ళెవరూ లేరిక్కడ
బ్రతకాలి, కిందా మీదా పడి మీదా కిందా పడి, లోహపు కాలంలో లోతు తెలియకుండా బ్రతకాలి
కాస్త ఓపిక చేసుకుని చూడు వాళ్ళ కళ్ళని ఒక్కసారి, గాజుపాత్రలవి
నువ్వు ఆర్ద్రంగా వొంపితే అనంతంగా రాలే కన్నీళ్ళూ, కథలూ అవి

అందుకే తాకి చూడు ఒక్కసారి వాళ్ళని-

ఎక్కడో చూసాను, ఎప్పుడో చూసాను నన్ను నీలో, నిన్ను నాలో-

వెళ్ళిపోకు, ఎరుకతో బ్రతికి ఉందామనే ఈ ప్రయత్నమంతా

11 October 2015

పంజరం

ఎగిరిపోదామనే అనుకున్నాను, స్వేఛ్చగా  
దూరంగా - 

మరి తెలీలేదు నాకు ఇన్నాళ్ళూ 

నా రెక్కలు 
నీ హృదయానికి కట్టివేయబడి ఉన్నాయనీ 
నన్నే పొదుపుకుని
అవే శ్వాసగా, నువ్వు జీవిస్తున్నావనీ -

తెలుస్తూ ఉంది మరి నాకు  

ఇప్పుడిప్పుడే 
నేను ఇంకా నీకు కట్టుబడి ఉన్నాననీ
అప్పుడే నిన్ను విడిచి 
నేను వెళ్ళలేననీ

ఈ గూడు ఏదో 

నీ నుంచి నాకూ నా నుంచి నీకూ
అనుసంధానమౌతూ   
అల్లబడుతుందనీ
అలా మాత్రమే అది నిలబడగలదనీ 
లోకాన్ని పొదగగలదనీ 
సాకగలదనీ -

ఎగిరిపోదామనే అనుకున్నాను

తెలియక ఇన్నాళ్ళూ 
స్వేచ్ఛ అంటే 
నా వద్దకు నేను తిరిగి రావడమనీ 
నన్ను నేను
పూర్తిగా నీలో కోల్పోవడమేననీ-

ధన్యవాదాలు. 

08 October 2015

పొంతన లేని

1
రాత్రిలో ఒక చెట్టు ఏదో మంచులో కూరుకుపోయినట్టు
భుజాలు వేలాడేసి, అడుగుతాడు అతను:
"ఇద్దరి మధ్యా ఇలా ఎన్నడూ లేదు. మరి ఇది నా ఒక్కడి తప్పేనా?"

తను తల తిప్పి చూసిన చోట - చెమ్మని రాల్చుతూ ఆకులు-

ఎండిపోయిన పుల్లలూ
విరుగుతున్న కొమ్మలు.
2
'తన జూకాల వలే
కదులుతాయి నీ పగళ్ళూ, రాత్రుళ్ళూ
తన కనురెప్పల వలే కొట్టుకులాడతాయి నీ అనిశ్చిత క్షణాలు-

నిరంతరం నిను వెంటాడే తన నయనాలలో

ఒకటేమో జ్వలించే సూర్యబింబం, మరొకటేమో కొలనులో చలించే
చంద్రబింబం. ఇక  తన చేతులేమో

సంధ్యారుణిమలో

నీ జీవితాన్ని తమ పరిమళపు అలలపై తీసుకువెళ్ళే
రెండు అమృతపు నావలు.'

ఇలా రాసి అతను ఆగిపోతాడు -

3

నేలపై చలించే నీడల్లో, ఒక్కత్తే తను -


చెట్టు కింద చెమ్మతో పాటు రాలిన

ఆకులనూ, ఎండిపోయిన పుల్లలనూ వంగి ఊడుస్తూ ఉంటే
ఏడో నెల కడుపు ఒత్తుకుపోయి నొప్పెడుతోంది -

కింది పెదవిని పంటితో నొక్కి పెట్టి

దుమ్మునీ ధూళినీ, అతను ఏడ్చిన పదాలనీ ఎత్తిపోస్తుంది -
'కవులు ఎన్నడూ స్త్రీలు కాలేరు' అని తను అనుకున్న క్షణాన

"అమ్మా, ఆకలేస్తుంది

ఏమైనా పెట్టావా" అని, తన వెనుకగా ఒక నాలుగేళ్ల పిల్లవాడు -
సరిగ్గా అప్పుడే
4
'కాలం కంపించే క్షణాలలో
మూగవాని చేతిలోని పిల్లన గ్రోవివి నువ్వు. రాత్రుళ్ళలో, నా నిదురలో
నేను వినే ఒక నదీ ప్రవాహం నువ్వు - నీళ్ళ ఒరవడికి
దొర్లే సన్నటి పాలరాళ్ళ సవ్వడివి నీవు.

నీ మేలుకువలోని నిదురను నేను

నా నిదురలోని మెలుకువ నువ్వు -
నువ్వు జన్మించినప్పుడు, నేను మరణిస్తాను. నా మరణంతో, నాలో
కొనసాగుతావు నువ్వు -' ఇలా వ్రాసి

ఈ కాగితపు అంచున, నిండు గర్భంతో తను

ఒక పిల్లవానికి అన్నం తినిపించి వేచి చూస్తుండగా
అతను ఆగక, వెళ్ళిపోతాడు.
5.
ఒక దీపం రాత్రంతా, చీకటి ప్రశాంతతతో -

కడుపుపై ఒక చేయీ, పక్కన పిల్లవాడిపై ఒక చేయీ

తో తను - ఆయాసంతో శ్వాస ఎగబీల్చినట్టు కిటికీలోంచి గాలి.
కనుల కింది ఖాళీ లోయల్లో చేరి ఊరే చెమ్మ వలే
గోడలపై వంటరి నీడలు. పగిలిన బొమ్మలు -

ఊగుతూ, ఊగుతూ, ఊయలవలే ఊగుతూ ఊగుతూ

ఆకస్మికంగా తెగిన తాడు వలే జీవితం. ఇక
ఒక అరచేయి మాత్రం వడలి, వడలి, భుజంపై
తల వంచిన పిల్లవాని శిరస్సు కింద కమిలి -

అమ్మా, ఒక కథ చెప్పవా  అని అడిగితే, ఆ పిల్లవానికీ

కడుపులో కదిలే శిశువుకీ
ఏమని చెప్పగలదు తను-?
6
రాత్రిలో, ఒక చెట్టు కింది మంచులో, చీకటిలో, చీకటితో ఒక కవి -
అటు పిల్లవానిలా కాలేక, తనలా మారలేక
రాసిన కాగితాన్ని చించి ముక్కలు ముక్కలు చేసి
ఆకాశంలోకి విసిరేస్తాడు అతను -

" పదాలు అర్థారాహిత్యాలు -

తనకీ, తన శరీరానికీ, శరీరంలోని ఒక శిశువు కలకీ
ప్రత్యామ్నాయంగా ఏవి నిలవగలవు?
ఇవన్నీ బూడిదలో మెరిసే నిప్పు కణికెలు" ఆని
అతను వెనుదిరిగి వస్తూ ఉండగా 
7
రాత్రిలో, చీకటింట ఒంటరి దీపంతో
ఆ ఖండిత వలయ కాంతిలో సాంధ్యచ్చాయతో తను - మంచంపై
నిదురోతూ ఒక కవిత, ఒడిలో పాలు తాగుతూ
జోలపాటతో  ఊగుతూ మరొక కవిత -

ఇక ఒక పూల కొమ్మ ఏదో మంచులో కూరుకుపోయినట్టు

అతనిని గట్టిగా పట్టుకుని , భుజాలు వేలాడేసి
గుమ్మం వద్దే వొణుకుతూ, బెక్కుతూ అడుగుతుంది తను ఇలా -

"ఇద్దరి మధ్యా ఇలా ఎన్నడూ జరగలేదు.

మరి ఇది నా ఒక్కదాని తప్పేనా?"

06 October 2015

a very sentimental poem

1
చీకటిలో 
నువ్వు దీపం వెలిగించినప్పుడు నేను లేను కానీ 
కొద్దిగా రెక్కలు విప్పిన 
తెల్లని పావురంలా మారిన మన గూటిని నేను 
ఊహించగలను 
2  
నేను 
వచ్చేటప్పటికి నువ్వు ఉండవని నాకు తెలుసు 
నీకూ తెలుసు -
అయినా 
వెలిగించి వెళ్ళడంలోనే నాపై నీ ఇష్టం దాగి ఉందనీ  
అదే జీవన సూత్రమనీ 
అదే నీ ఇంద్రజాలమనీ 
ఎందరికి 
తెలుసు?
3
నేను 
వచ్చేటప్పటికి నువ్వు లేవు: నువ్వు వెలిగించి ఉంచిన
కాంతి వలయంలో  
నీ
శరీర సుగంధం. సన్నగా చలిస్తూ కదిలే సెగలో నీ 
పసుపు పచ్చని ముఖం - 
వండి ఉంచిన 
పాత్రలో 
మెతుకుల్లాంటి నీ మాటలు. బల్లపై ఉంచిన 
మంచి నీళ్ళ గాజు పాత్రలో 
నీ మౌనం -   
తెరచిన 
కిటికీలలోంచి చల్లటి రాత్రి గాలి. ఇక ఎప్పటిదో మరి 
నీ సన్నటి నవ్వు 
ఇప్పుడు 
ఇక్కడ 
చీకటిలో మిణుగురై మెరుస్తోంది - 
4
చీకటిలో 
నువ్వు దీపం వెలిగించినప్పుడు నేను లేను కానీ 
కొద్దిగా 
బెంగటిల్లి 
రెక్కలు నిక్కబొడుచుకుని ఉర్ర్ ఉర్ర్ మంటూ 
గూట్లో 
అక్కడక్కడే 
మెసిలే ఊదా రంగు పావురంలా నేను: తోడుగా 
ఈ అక్షరాలూ -
అది సరే కానీ 
5
మరి 
నువ్వు తిరిగి వచ్చేదాకా, వచ్చి తాకి శ్వాస అందించేదాకా  
మేమంతా 
ఏం చేయాలో
ఎలా ఎదురు చూడాలో చెప్పడం 
ఎలా మరచిపోయావు 
నువ్వు?

29 September 2015

జీవించడం

నడవలేక ఇక, అతను అక్కడే కూలబడతాడు -

మరెక్కడో గాలి
సుడులు తిరిగి తిరిగి నెమ్మదిగా ఆగిపోతుంది. వడలిపోయి  
ఒక పూవు తల వాల్చేస్తుంది. ఇక 
సాయంకాలపు పల్చటి చీకటి

నెమ్మదిగా
ఆ గదిలో వలయాలుగా వలయాలుగా చుట్టుకుంటుంటే 
లోపలంతా వేర్లు వెలికి వచ్చిన వాసన: నేలపై 
పక్షి గూడు చీలికలై మిగిల్చిన ధూళి
సొన. ఆకులూ, ఈకలు -

"ఏమయ్యింది నాన్నా"
అని పిల్లలు ఆ తరువాత ఎప్పుడో హత్తుకుని అడిగితే 
అతను గొణుక్కుంటాడు ఇలా తనలో తాను 
బీతిల్లిన గొంతుతో, ఒక స్మృతితో: 

"నేర్చుకుంటారు
త్వరలో మీరు కూడా - జీవించడం ఇలాగ:
వేయి దీపాలు ఆరిన హృదయంతో 
ఆ పొగతో."

28 September 2015

గడచిన దూరం

గడచిన ఎంతో నిశ్శబ్ధం తరువాత
గడప వద్ద నుంచి
లోపలికి నువ్వు

నడచిన ఎంతో దూరం తరువాత

నీ గుమ్మం వద్ద
నిస్త్రాణగా నేను

లోపలెక్కడో గిన్నెలోకి పడే నీళ్ళు:

పిచ్చుక పిల్లల
అరుపుల్లా -

బియ్యం కడుగుతూ, సాంధ్యచ్చాయలో

అలలవలే గోడలపై
నీ చేతి గాజుల
నీడలు

సన్నటి శబ్ధాలతో, మాటలేవో చెబుతూ

పిల్లలకి అన్నం
పెడుతున్నట్టు -

గడచిన ఎంతో దూరం తరువాత
కొంత శాంతి. రాలిపోయే
పూలల్లో వర్షపు
కాంతీ: గాలీ -

ఇక ఎవరంటారు, ఈ పూట నేను

తీరం తెలియని ఒక
ఒంటరినని?

27 September 2015

నివేదన

అవాంతరాలూ  అడ్డంకులూ ఏమీ లేకుండా  అహ్మద్ ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకున్నాడు.

అతను కనపడగానే, ఆ రోజు -  దారుల్లో  వీధుల్లో  ఎవరూ  మైకుల వాల్యుమ్ పెంచలేదు. అతను  వీధి మలుపు తిరగగానే  చేతులకీ, నెత్తులకీ కాషాయపు రంగు నెత్తురు గుడ్డలతో అతనిని చూసి ఎవరూ వంకరగా నవ్వలేదు.  నడుస్తూ నడుస్తూ తల ఎత్తితేఆ రోజు ఎవరూ గార పట్టిన గుట్కా పళ్ళతో, మందు వాసనతో చీత్కారంగా కాండ్రించి  ఊస్తూమూడు గుండీలు విప్పిన  అంగీని వెనక్కి తోసుకుంటూ కనుబొమ్మలను కవ్వింపుగా ఎగుర వేయలేదు. ప్రతి సందూ కబ్జా అయ్యి ఒక రామ మందిర నిర్మాణమయ్యీ, అతను వాళ్ళని దాటుకుని ఒదిగొదిగి వెడుతున్నప్పుడల్లా ఎప్పటిలా లీలగా 'ఇస్కీ బెహెన్కి చోత్', మాధర్చోత్  అనే పదాలు అతని వెన్నుని తాకలేదు. ఒక మస్జీద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. దాటుకుంటూ వచ్చిన ప్రతి వీధిలోనూ  అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరాం అని నినదించలేదు. ఉన్మాద నృత్యాలతో  గణగణగణమనే గంటలతో, నుదిటిన త్రిశూలాల వంటి బొట్లతో ఎవరూ అతన్ని భయభ్రాంతుడని  చేయలేదు. అతని ఒళ్లంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు. 

సరే. నిమజ్జనం ముగిసింది. ఏదో సద్దుమణిగింది. అతని నగరం కొంత తెరపి పడింది. ఇక

ఆవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా ఆ రోజు అహ్మద్ త్వరగా ఇంటికి చేరుకునిభార్య ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి, తెచ్చిన అరటి పళ్ల సంచిని ఆరేళ్ళ పిల్లల చేతికిస్తుండగా గోడకి చతికిల బడిన అతని ముసలి తల్లి అంటుంది కదా -

"వచ్చావా నాయనాత్వరగా స్నానం చేసి భోజనం చేయి. ఇక ఈ పూటైనా పిల్లలు నిశ్చింతగా, కంటి నిండుగా నిదురోతారు"

20 September 2015

రాత్రంతా

రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక, విలవిలలాడుతూ మూల్గుతూ, వర్షపు రాత్రి గాలి నా చుట్టూతా –

రాత్రంతా
ఊగిసలాడుతూ గోడలపై నీడలు. తడచిన లతలు.
ఎక్కడో వాన వెలిసిన నీళ్ళు బొట్టుబొట్టుగా రాలుతూ చేసే హృదయ విదారక శబ్ధం.
బాల్కనీలో రాలిన ఆకులకుపైగా, సగం ఒరిగిన గూటిలోంచి వెలికి వచ్చిన
లేత పక్షి రెక్క ఒకటి, తడచి ముద్దయ్యి –

(ఎవరు చెప్పగలరు మరి
అది బ్రతికి ఉందో, లేదో?)

రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక, విలవిలలాడుతూ తన కనుల అంచుల నుంచి ఒలికిన చుక్కలు
విరిగీ ఆవిరయ్యీ, తన చేతులు రెండూ, రెండు అలసిన కాడలై నాలోకి ఒరిగిపోతే
అంతటా ఒక నిశ్శబ్ధం. అంతటా ఒక నిస్సహాయత. అంతటా
ఒక హృదయ కంపన. దీపం పగిలిన వాసన. అంతటా
పదునైన చీకటి చెమ్మ ~

రాత్రంతా
ఏడుస్తూ ఉంది తను
ఇక రాత్రంతా - నాలోనూ, మూసుకున్న తన కళ్ళలోనూ, తనకు పైగా
విసురుగా తిరిగే పంకా కిందుగా, ఏ క్షణాన తెగుతుందో తెలియని సీతాకోక ఒకటి
బయట పడే దారి తెలియక విలవిలలాడుతోఅక్కడక్కడే 
ఎగురుతో కొట్టుకులాడుతోఒక్కత్తే తపిస్తో ~