ఉదయాన్నే లేచి, నిదురలో
హాయిగా తేలుతున్న పిల్లల ముఖాలని చూసుకుంటాను. ఒక పురాతన పుష్పపు పరిమళమేదో చుట్టుకుంటుంది. నెమ్మదిగా కదిలి బాల్కొనిలో పక్షులు అల్లుకున్న గూడుని
చూసుకుంటాను.
చెమ్మగిల్లిన
కాంతి,
చల్లని నీడా కలగలసి తిరుగుతాయి గోడపై. ఎదురుగా గాలికి ఊగే పచ్చని చెట్లపై వేకువజామున రాలిన ఓ మంచు శబ్దాన్ని వినేందుకు ప్రయత్నిస్తాను, అరచేతిలో వెచ్చగా ఒదిగిన కప్పు తేనీరుతో-
లోపల
గదిలో,
కాగితాల అలికిడి వంటి నా తల్లి మాటలు. నలిగిన పుస్తకంలో దాగి ఉంటాయి తన వృద్ధాప్యపు లేఖలు. ఆ ముసలి అరచేతుల మధ్య ఒకప్పుడు ఎన్ని ముఖాలు ఒదిగాయో ప్రేమగా, ఇప్పుడు పసిడి మడతలు పడిన తనలో ఒక మహా శూన్యం.
వంట
గదిలో నీళ్ళ సవ్వడి. పాత్రల అలజడి. నిప్పు వెలిగి శుభ్రమయ్యే నిత్య దైనందిన జీవన శ్రుతి. కూరగాయలు తరుక్కుని, కడుక్కుని ఈ భూమి దయతో అందించిన బియ్యపు గింజలు వండుకుని, డబ్బాలో కట్టుకుని స్నానం చేసి అలా దిన వారీ పనులు చేసుకునేందుకు లోకంలోకి కదిలే ఒక పవిత్రమైన పని. ఏమీ లేదు ఉదయాన్నే లేచి, ఇదిగో
ఇలాంటి
నాలుగు
వాక్యాలని రాసుకునేందుకే బ్రతికి ఉంటాను. యిక తలుపు తీసి బయట అడుగిడితే ఎదురుగా అలసటగా నా పిల్లల్ని చూసేందుకు వచ్చే నా ముదుసలి తండ్రి. ఎక్కడో నల్లటి మట్టి చిట్లి, నల్లటి మేఘం పిగిలి ఓ వర్షం మొదలవుతుంది.
కాలం వలయమై, చిన్నగా చల్లగా కురిసే వర్షం.
ఇద్దరం
ఎదురెదురు పడి,
ఇద్దరి కళ్ళు మిళితమై, నుదిటిని
ఆనుకున్న నా భార్య అరచేయ్యై, సాగుతాం ఇద్దరం అందరితో - యిక ఈ రోజుకి ఇలా ఉండటం మంచిదే. ఈ నాలుగు వాక్యాలు రాసుకోవడం మంచిదే. ఇంతా చదివి, ఇదేమిటని మీరు అడిగితే, యిక నేను ఏమీ చెప్పలేను, నిండుగా సజలమైన ఈ నా మీ హృదయంలో మీ చేయి జార్చి ఒక అద్దాన్ని వెలికి తీసి మిమ్మల్ని మీరు చూసుకోమని చెప్పడం తప్ప.
మీ దినచర్య బాగుంది. చక్కగా వ్రాసారు.
ReplyDeletegood poem
ReplyDeletegood one sir
ReplyDelete