14 September 2012

స్థభ్దత

నీ ముఖం ఎందుకో స్తబ్ధమయ్యింది. 

బహుశా ఎవరూ ఎత్తుకోలేదు ఇవాళ  నీ  ముఖాన్ని  తమ అరచేతులతో. అందుకే  బహుశా ఈ మధ్యాహ్నం నీ గదిలో ఒక మూలగా కూర్చుని ఉంది నీ నీడ. అప్పుడు 

ఇక నువ్వు నీ కనురెప్పలని బరువుగా లేపినప్పుడు కనిపిస్తాయి రెండు ఊదా రంగు పిట్టలు, కిటికీకి చుట్టిన కేబుల్ తీగలపై  పచ్చటి గడ్డి పరకలతో ఒక గూడుని అల్లుకుంటో: ఎవరో తమ రెండు అరచేతులని ప్రార్ధనకై జోడించి ఆకాశాన్ని వేడుకుంటున్నట్టున్న  గూడు.  

ఇక ఒక నిట్టూర్పుతో కదులుతావు నువ్వు. నేను లేని ఇంట్లో నేను రాసిన కాగితాలపై ఉన్న అక్షరాలని నీటి రంగులతో చెరిపివేస్తూ ఆడుకునే నీ పసిబాలుడు ఇక నిన్ను చూస్తూ అంటాడు కదా: 'అమ్మా, ఇవాళ  నేను నీ కళ్ళల్లో నిదురపోతాను.'
ఆనక ఏ రాత్రో వచ్చి

ఒక  చీకటి  కన్నీటి గూటిలో ముడుచుకుని 
ఒక అశ్రువుని కౌగలించుకుని నిదురోతున్న 
మరొక అశ్రువుని చూసి   

నా ముఖం ఎందుకో స్తబ్ధమయ్యింది. 

1 comment:

  1. ఆనక ఏ రాత్రో వచ్చి


    ఒక చీకటి కన్నీటి గూటిలో ముడుచుకుని
    ఒక అశ్రువుని కౌగలించుకుని నిదురోతున్న
    మరొక అశ్రువుని చూసి


    నా ముఖం ఎందుకో స్తబ్ధమయ్యింది.

    ReplyDelete