25 September 2012

అతడొక్కడే*

హృదయంలో ఒక దీపాన్ని దాచుకుని
లోకానికి చీకటి ముఖాన్ని చూయిస్తూ
రిక్త అరచేతులతో, నిండు నయనాలతో

రాలే కాలాన్ని చూసే,  ఏమీ లేక
అన్నిటినీ పొందిన మనిషి ఒక్కడే
ఈ నాలుగు దారుల రద్దీ కూడలిలో

వస్త్రాలని వదిలి, దేహాన్ని విడిచి
ఈ ఉదయపు ఎర్రటి కాంతిలో
నిలకడగా నిలబడి చేతులు చాచిన
మనిషి ఒక్కడే ఇక్కడ.

మౌనం ఒక మహా సంగీతమేమో.
ఉండటం ఊరికే అలా, ఇక్కడ ఒక
మహా ఉపాసనేమో, ఒక మహా కళేమో.

నాకు సాధ్యం కాని నిరాపేక్ష ఉనికిగా
తారు ధూళిలో, వాహనపు పోగలలో
అతడొక్కడే మనిషి

శిరోజాలు వంకీలై పీలికలైన అంగవస్త్రమై
ఈ దినంపై సృష్టి అద్దిన వెలిగే నిశ్శబ్ధమై
అతడొక్కడే మనిషి,    నా హృదయంలో.

ఇక స్కూలుకి వెడుతూ వెడుతూ
పిల్లలే చాచిన అతని అరచేతిలోకి
అతని కన్నులలోకీ

తాము తీసుకు వెళ్ళే పుష్పగుచ్చాలనీ
అర తెరిచిన డబ్బాలలోంచి, తమ
అల్పాహారాన్నీ పదిలంగా ఉంచుతారు

హృదయంలోని దీపాలని మరచిన
ఎదిగిన ఇతరులు, యిక ఎప్పటికీ
తాము నిండలేకా, తమని తాము
ఎప్పటికీ నింపుకోలేకా, ఇక ఇక్కడే

ఈ యంత్ర మోహిత
నల్లటి ధూపాలలోనే
లోహాలలానే నక్షత్రాలు పూయలేని
ఆకాశంలానే

ఆకాశం అంటతా అంటిన
చీకటిలానే ఇక ఇప్పటికే
ఇక ఎప్పటికీ-
_________________________________________________________________
*ఒక మునుపటి వాచకం. స్థలం: విద్యానగర్ చౌరస్తా. ఒక సోకాల్డ్ 'పిచ్చివాడు' రోజంతా అక్కడ చేయి చాచి గంటలు తరబడి ప్రసన్నమైన వదనంతో నిలబడి ఉండేవాడు. అప్పటిలో, అతడిని చూసి కొంత అబ్బురం కొంత అయోమయం కొంత ఆలోచనానూ. మరి అతడు ఇప్పుడు ఎక్కడో తెలియదు. 

No comments:

Post a Comment