11 September 2012

సూత్రం

నిలువెత్తు వస్తుమహళ్ళలో, వ్యాపార దర్పణాలలో
      నిండుగా పొందికగా జత కట్టి నియంత్రించిన, తళతళలాడే
           నియాన్ దీపకాంతులతో మెరిసే ఆ ఆకుల అల్లికల పుష్పగుచ్చాల
నియమిత సౌందర్యమే కానవసరం లేదు.

సాయంత్రాలలో మట్టిదారి పక్కగా రాలిపడిన
     ఒక గడ్డి పూవు చాలు. ఒంటరి శ్వేతరాత్రుళ్ళలో
           వెన్నెల ఊరి చలికి తొణికిసలాడే ఒక నల్లని గులకరాయి చాలు-

నిండుగా నీ శ్వాస ఊయలలూగే
        చెమ్మగిల్లిన ఒక పదం చాలు. కానీ వెళ్ళు వాళ్ళ వద్దకి.
                   నీ వాళ్ళు కాని వాళ్ళ వద్దకి. చూడు కాగి, అలసి, కమిలి

ముకుళితమైన ఆ వదనాలు, చల్లటి చినుకులను తాకి
          ఎంత హాయిగా విప్పరుతాయో! పరవాలేదు. పోయేదేమీ లేదు.

చివరికి అందరమూ
చుక్కలని కప్పుకుని
      చీకటిలోకి మట్టిలోకీ తలవంచుకుని
            ఏకాంత ప్రార్ధనతో వెళ్ళిపోయేవాళ్ళమే. ఎప్పుడూ ఏమీ లేనివాళ్ళమే.
   
వెళ్ళు. ఇక్కడినుంచి వాళ్ళ వద్దకి. నీ వాళ్ళు కాని వాళ్ళ వద్దకు.
కొంత నీ ప్రేమతో కొంత శాంతితో. కొంత
అవగాహనతో కొంత అంతిమ ఎరుకతో.

1 comment: