12 September 2012

ఏమిటిది?

అర్థాల దీపాలు వెలిగించి కూర్చున్నానా ఇక్కడ  నేనేమైనా
     ఆ పరమ దివ్యకాంతిలో నీకు అంతిమ సత్యాన్ని భోధించేందుకు?
         పూలహారాలు కావివి, నీకు తెలిసిన శారీరిక ధర్మాలు కావివి - నెత్తురు

అద్ది దిద్దుకున్న మృత్యుదారులు ఇవి. ఇవే, ఈ పదాలు
       నీకు అర్థం కాని వాచకాలు. ఇద్దరు ముగ్గురయ్యి, ముగ్గురు అనేకమయ్యి
              చివరికి ఒంటరిగా మిగిలిపోయే పరిమిత పదాలు.

బిందువు నుంచి బిందువుకి మధ్య సాగే ఒక వలయంలో ఉండే
       బిందువులెన్ని? చూడూ, నవ్వుతున్న పాపలూ, దారి పక్కన ఉచ్ఛతో
               విశ్వపు ఆదిమ రంగవల్లులను అలికే పిల్లలూ, రోదించే తల్లులూ
               నిరాకర పురుషులూ దారి లేని ఆత్మలూ దేహ దేశ ద్రిమ్మరులూ

అర్థం కాని అర్థాలు: తల వంచుకుని
        వృక్షాల కింద వానలో వంటరిగా వెళ్ళే
                    నైరాశ్యపు శక్తులను చూసి నవ్వకు
                                    కదలించకు - చూడు. ఏమో

నువ్వూ నడుస్తావేమో,  ఒక కాలం అనంతరం
        ఈ వలయ వివశిత విషాద మోహపు ఛితాభస్మపు దారులను. రా
             ఇక్కడికి, పేగు తెగని నీ గీతాలని వదిలివేసి, దాగిన నీ ప్రతిబింబపు

దర్పణ సమాధుల వద్దకి!
మొదలు పెడదాం మనం
ఇక ఒక కొత్త మరణాన్ని- (నీతోనే)  

1 comment:

  1. నువ్వూ నడుస్తావేమో, ఒక కాలం అనంతరం
    ఈ వలయ వివశిత విషాద మోహపు ఛితాభస్మపు దారులను.
    wonderful

    ReplyDelete