17 September 2012

తూనీగలు

మా మత్తుగా పెరిగిన పిచ్చి మొక్కల మైదానం మీదుగా
ఎగురుతాయి గుంపులుగా తూనీగలు
ఎర్రటి మధ్యాహ్నపు  అద్దపు కాంతిలో-

ఆ పచ్చి పిచ్చిమొక్కలని  పీకి యిక  ఆ
ఇద్దరు పిల్లలు ఒకటే పరుగు వాటి వెంట

శివాలు ఎక్కి రౌద్రంగా కొరడాలు జుళిపించినట్టు
అన్నం తిన్నాక మళ్లీ మోగే ఒక అరగంటలోపు
ఎన్ని తూనీగలు రాలేవో గాలిలో మా చేతులలో 

చచ్చి కొన్ని చితికి కొన్ని ముక్కలై కొన్ని
రెక్కలు తెగి కొన్ని, ఎగరలేక  కొన్ని
నేలపై భారంగా ఈదులాడుతూ పడి
ఉన్న కొన్నిటిని  రెండు వేళ్ళ మధ్య
ఇరుకించుకుని ముఖానికి దగ్గరగా లాక్కుని వాటి కళ్ళలోకి చూస్తే

మిణుకు మిణుకుమంటూ కనిపించేవి
ఏవో ప్రపంచాలు లోతుగా చీకటిగా
జిగటగా, నాన్న కొట్టాక తెగి కారుతున్న
నెత్తురంటిన అమ్మ పెదాలలాగా.

శరీరం జలదరించి వాటిని వదిలివేసి
పరిగెత్తాడు వాళ్ళల్లో ఒక పిల్లవాడు
మరొకడు ఆ తూనీగలని కాళ్ళ కిందేసి తొక్కి పిచ్చిగా నవ్వుతుండగా-

ఇకా తరువాత దట్టంగా మబ్బు పట్టి
వాన కురిసింది దడగా పిచ్చిపిచ్చిగా
ఆ మసక మధ్యాహ్నమంతా - మరి

వాలేపోయాయి ఆ పచ్చని పిచ్చిమొక్కలు
తడిచిపోయి, వొణుకుతున్న అతడి
హృదయం నిండా, శరీరం నిండా-ఇకా రాత్రీ

అప్పుడూ ఇప్పుడూ, తెగిన తెల్లని రెక్కలతో
దిగి వస్తాయి తూనీగలు, నేను నరికిన పిచ్చి
కళ్ళ లేత తూనీగలు, జ్వరపీడిత కాలాలలో
చిత్తుగా నానిన ఆ పచ్చిమొక్కల వాసనతో

నేను వెళ్ళలేని మైదానాలై నేను  చేజార్చుకున్న
స్త్రీలై, ఏ జన్మలోనో వెలిగించిన  దీపపు ధూపమై
ఈ జన్మకీ సాగే హృదయాన్ని కబళించే ఓ అజగరమై చేయి జారి తొలికిన నీళ్ళలాంటి
కనులై, వేర్లు వెలుపలకి వచ్చి వొరిగిన ఆ పిచ్చిమొక్కలై

దారి తప్పి ఓ గదిలో చిక్కుకుపోయి
విద్యుత్ కాంతి అంటుకుని రెక్కలు
నెమ్మదిగా కాలిపోతూ అల్లాడుతున్న ఒకే ఒక్క ఒంటరి తూనిగై-         

No comments:

Post a Comment