01 July 2013

మూర్ఖుడు

It is a tale
Told by an idiot, full of sound and fury
Signifying nothing.
 — Macbeth (Act 5, Scene 5)-
1
వేకువఝాములలో వచ్చి, దుప్పటి తొలగించి, నెమ్మదిగా తను నీ పక్కన చేరేది. అప్పుడు, నీ కలలో తన శరీర స్పర్శ: లేత ఎండలో, పిచ్చుకలు రెక్కలు విదిల్చి తిరిగి గూళ్ళల్లో ముడుచుకున్నట్టు, నీ బోజ్జలోకి తను ముడుచుకుపోతే, నీ నిదురలోకి ఒక తల్లి తన స్థన్యం అందించినట్టు, ఆకలికి తల్లడిల్లిన ఓ శిశువు- మూసుకున్న కళ్ళతో- వొణికే వేళ్ళతో చూచుకాన్ని అందుకున్నట్టు, నీకు నీ నిదురలో

కొంత శాంతి. జనన మరణాల మధ్య వ్యాపించిన కొంత కాంతి. చిన్నగా చెట్లు కదిలి, రావి ఆకులు గలగలలాడే సవ్వడి. నదీ తీరాన, సంధ్యకాంతిలో ఓ నావ ఆగి ఊగుతున్నట్టు, కనురెప్పల కిందకి తేలి వచ్చే అలల తడి: నీ చుట్టూతా పురాస్మృతుల అలికిడి. ఇక చేతులు వేసి తనని, నీ నిద్దురలోకి దగ్గరకి లాక్కుంటే
2
ఎక్కడిదో మరి ఒక తుంపర: తూనిగలు పచ్చిక మైదానాలలో ఎగురుతున్నట్టూ, పూల పొదలు నీలోకి లేత వేడిమితో అడుగిడి విరగబూసినట్టూ, మంచు తాకిడికి గడ్డి పరక కదిలినట్టూ, సీతాకోకచిలుకలు ఏవో చిన్నగా వాలినట్టూ, నీలో నీ నిద్రలో, ఒక కాల స్వప్నం. ఒక స్వప్న లోకం. అనేకానేక లోకాల సంచారం. పలు మార్లు జననం పలుమార్లు మరణం-
3
ఇక, తన అరచేతిని నీ చేతిలోకి తీసుకుని, నిద్రలోనే ఎక్కడో మెదిలిన ఒక నెత్తురు నీడకి, దిగ్గున లేచి కూర్చుని చూస్తావా- మరిక ఇక్కడ నీ పక్కగా ఒక మహాశూన్యం. నలిగిన పక్కలో వ్యాపించే ఒక మహా నిశ్శబ్ధ శబ్ధం: ఎవరో నీలో చేరి ఒక సమాధిని తవ్వుతున్నట్టూ, మరెవరో నిన్ను అక్కడికి మోసుకు వస్తున్నట్టూ, తమ గుండెలు బాదుకుని భోరున హోరున గొంతు తెగేలా ఏడుస్తున్నట్టూ-
4
మరికా తరువాత నువ్వు నిదురోయింది ఎన్నడు? 

No comments:

Post a Comment