10 July 2013

ఎన్నడైనా?

నువ్వు అప్పుడు లేచి ఉండవు. నీ గది బయట

ఒక తుంపర . వెన్నెలాంటి కాంతి. చెట్ల కిందుగా
రాలే ఆకులూ, వాటిని ఇముడ్చుకుని
ఎగిరిపోయే గాలి. నీ ఆత్మ వొణికిపోయే

చల్లటి గాలి. మరి, అప్పుడు ఎక్కడైనా
నీ చుట్టూ నువ్వు చేతులు చుట్టుకుని
నీ తలను వంచుకుని గుండెల నిండుగా

ఎవర్నన్నా పీల్చుకుని నీలోకి నువ్వు
నడిచి పోవడం బావుంటుంది - కొంత
బ్రతికినట్టు, మెలుకువలోకి వచ్చినట్టు

పూలు నిండిన గృహంలోకి ఎవరో నీ
హృదయాన్ని జాగ్రత్తగా దించినట్టూ
పరిశుభ్రం చేసి నిన్ను వెలిగించినట్టూ-

మరి నడిచావా నువ్వు అలా, ఎన్నడైనా ఎప్పుడైనా
మరొకరి కలలోకి మెలుకువవై, తిరిగి ఆ
మెలుకువలోకి ఒక సుగంధపు కలవై
ఊగే లేత ఆకువై,ఒక పసిడి పసి నవ్వై-?

No comments:

Post a Comment