18 July 2013

పూవులు,భవంతులు

ప్రేమంటే ఏమిటి అని నువ్వు అడుగుతావు కానీ, పెద్దగా
ఏమీ ఉండదు-
వాన వెలిసాక

ఈ దారి పక్కగా కొట్టుకు పోయే, ఈ లేత ఎరుపు పూవు
రాలింది ఎక్కడో
నాకు తెలియదు

అది ఎవరిని తాకిందో, ఏ గాలిలో తనువుని మరచి ఎగిరిందో
ఎవరి చేతుల మధ్య
పసి నిదురయ్యి
ఒదిగి పోయిందో
నాకు తెలియదు-

నీకూ తెలియదు.

ఇంకా సాధ్యం కాలేదు మనకు: ఈ భవంతుల మధ్య పచ్చగా
మొలకెత్తడం ఎలాగో.
చినుకులని రాల్చే
చెట్ల కిందకు వెళ్లి

మళ్ళీ నవ్వడమెలాగో. గాలి మాలలతో ఇరువురమూ
కౌగలించుకుని
ఇకిలింతలతో
బ్రతికి/పోవడం
ఎలాగో. ఇక

చల్లని చీకట్లోకి
పూల శవాలతో
సైకిళ్ళపై నీ/నా

హృదయ వీధుల్లో నుంచి 'పూలు పూలోయమ్మా
మల్లె పూలం'టో
ఒంటరిగా, వెళ్లి/
 పోయిందెవరని

నన్నసలే అడగకు!   

No comments:

Post a Comment