05 July 2013

ఇలా

ఏముందని అడుగుతావు ఇక్కడ, ఈ రాళ్ళూ మట్టి బెడ్డలూ తప్ప- అని

అరచేతుల్లోకి తీసుకుంటే అవి పసి వదనాలు-
శ్వాసిస్తే, రాత్రంతా వెన్నెల్లో తడిచి
ఉదయాన వికసించి సువాసనను
వెదజల్లే పూవులు. ముట్టుకుంటే

కదిలిపోయి, నెత్తురై రాలిపడే మనుషులు, దగా పడ్డ అనేకానేక కుటుంబాలు-
చూడగలిగితే, అవి అశ్రువులని
దాచుకుని, అన్నం పెట్టిన స్త్రీల
అరచేతులు. పలుకగలిగితే నీ
నాలికపై అవి బీజాక్షరాలు. దా

మరి ఇక్కడికి.ఈ రాతి నేలపైకి-

ఇంత మట్టిని నులుముకుని నీ
ఒంటికి రాసుకుని కనురెప్పలపై
అద్దుకో- శిరస్సుపై జల్లుకో- ఇక నీ ఒంటరి లోకాలలోంచి, నువ్వు

ఒక చినుకై రాలి బ్రతికిపోతావు- 

No comments:

Post a Comment