12 July 2013

దయ

కొంచెం దయగా ఉంటే పోయిందేముంది అని అనుకుంటాను నేను-

వాళ్ళూ మనుషులే కదా, ఎక్కడో ఎందుకో కరకుగా మారాల్సి వచ్చి
కరడు కట్టుకు పోయి ఉండవచ్చునని, తోటి వారిని
మనుషులుగా గుర్తించడం మరచిపొయి ఉంటారనీ
అది, వాళ్ళ సహజ నైజం కాదని, అది వాళ్ళు కారనీ-

బయటేమో, మొన్న జల్లులా, కాంతి పూల రేకుల్లా రాలిన వాన, ఇవాళ
కుండపోత - పోలిక కావాలంటే, నల్లని నింగిలోంచి
తెల్లని కాక్టస్లు గుత్తులుగా రాలుతున్నట్టు - మరిక

నువ్వు నిశ్చింతగా ఇంట్లో కూర్చుని టీవీలలో వార్తలు చూసే తీరిక వేళల్లో
ముంపుకి గురయ్యి అనేకమంది నిరాశ్రుయులుగా
మారుతుండ వచ్చు.ఆకలికి అలమటించి పోతుండ
వచ్చు. ఎక్కడో కోల్పోయి, జారిపోయి, మరి ఎక్కడో

శవాలుగా తేలుతుండనూ వచ్చు. 'ఇవన్నీ నీకెందుకు' అని నువ్వు అంటే

ఇక నేనేమి చెప్పను? నువ్వు నన్ను చీదరించుకున్నా
నువ్వు నీ దినవారీ చర్యలలో భాగంగా, నన్ను నిత్యం
గిరాటు వేస్తున్నా, ఓ ఖడ్గాన్ని నా హృదయంలో దింపి
మెలి తిప్పి నన్నొక చోద్యాన్ని చేసి చూసి ఆనందిస్తున్నా

నీకూ, విషపు బెరడు పేరుకున్న నీ రంగురంగుల నాలికకూ, ఇదిగో ఇలాగే

ఇదే చెబుతాను: జీవితం పట్ల కొంచం దయగా ఉంటే
తప్పేమీ లేదనీ, మనుషులని కాస్త కావలించుకుంటే
మరక అంటేది ఏమీ లేదనీ. ఇందా:  అందుకో మరిక

నా తల్లి తన నెత్తురు బుట్టలోంచి వెలికి తీసి నీకు ఇస్తున్న ఈ పద పుష్పాన్ని- 

1 comment:

  1. Srikanth, baavundi,
    inka koddiga expand gaa raasthe
    baavundedi,
    nevertheless it is touching.

    SRIDHAR

    ReplyDelete