22 July 2013

తప్పు

నీ కళ్ళే గుర్తుకొస్తాయి, అవే వర్షం కురిసే నీ కళ్ళు-
     గాలికి కర్టెన్ తొలిగి, కన్నీళ్లు కనిపించకుండా చటుక్కున
          పక్కకి తిరిగే, నువ్వూ నీ ముఖమూ గుర్తుకు వస్తాయి ఇక్కడ-

చదవకుండా పరాకుగా తిప్పివేసిన పుటలలో, క్షణకాలం
చదివిన కవితా వాక్యాలేవో గుర్తుకు వచ్చి
ఇక ఆ కవిత ఏదో ఎక్కడా దొరకనట్టు. కానీ
   
ఏం చేయగలడు అతను. ఇప్పటికీ చెట్ల కింద నిలబడి,
     వెళ్ళిపోయిన వానని తిరిగి రమ్మని పిలిచే అతను? అరచేతుల్లో
          మిగిలిన చినుకుల్లో తన ముఖాన్ని చూసుకునే
అతనూ అతని కళ్ళూ?

అందుకే గొణుక్కుంటున్నాడు ఇలా అతను
తనతో తాను తనలో తాను: *1చెట్లు తమ పక్షుల వద్దకు ఎగిరి వెళ్ళే
     ఈ వసంత కాలంలో, 2ఒక పూవుని సమాధి చేసి
దానిపై అతనిని ఉంచండి' అని. మరి

అందులో, ఆ కోరికలో, ఆ మృత్యు జననంలో తప్పేం ఉంది?
--------------------------------------------------------
*1. Spring: trees flying up to their birds.
2. Bury the flower and put a man on its grave -Paul Celan. 

No comments:

Post a Comment