18 July 2013

వాలు కుర్చీ

నీకో వాలు కుర్చీ ఇష్టం ఉండి ఉండవచ్చు.ఎన్నో ఏళ్ళుగా కలగని ఎలాగోలాగ ఒకదానిని చివరకు నువ్వు కొనుక్కుని ఉండి ఉండవచ్చు. మరి ఒకనాడు

నువ్వు పని నుంచి తిరిగి వచ్చి, అలసటగా అలా ఆ వాలు కుర్చీలో వాలిన నాడు, ఆకాశం కొంత ముసురు పట్టి ఉంటుంది. జల్లించిన చీకటి ఏదో గాలితో కలసి చల్లగా నీ ముఖాన్ని తాకుతుంది.  ఇక, అప్పుడెవరో తడచిన వస్త్రాన్ని విదిల్చినట్టు నీ చుట్టూ శబ్ధాలు- నీ సమక్షంలో తెల్లటి పూలు విచ్చుకున్నట్టూ, కళ్ళెత్తి నిన్ను చూస్తున్నట్టూ తమ అరచేతులలోకి, నీ ముఖాన్ని అందుకుని ముద్దాడుతున్నట్టూ, నీలోకి ఒదిగిపోతున్నట్టూ, శబ్ధాలు అంత లేతగా ఉంటాయని, పసివేళ్ళ వలే తాకుతాయనీ తెలియలేదు నీకు ఇంతకాలమూ-

ఇక నువ్వు తల తిప్పి చూస్తే నీ ఇంట్లోనే మిలమిలా మెరిసే నక్షత్రాలు. పిల్లల అరచేతుల్లోంచి ఎగిరి వచ్చి నిన్ను వెన్నెలతో దయగా తాకే సీతాకోకచిలుకలు. ఆ రెక్కల ఝుంకారంలో దాగిన తేలికైన రాత్రుళ్ళు. ఎలా అంటే, కలలో తెలిసిన పరిమళమేదో మెలకువలోకి వచ్చి నిన్ను ఒక మహా విభ్రమానికి గురిచేసినట్టూ, గత జన్మ స్మృతులేవో జ్ఞప్తికి వచ్చినట్టూ, మృత్యు రహస్యమేదో బోధపడి ఇక నువ్వు విరామంగా సాగినట్టూ, నిజంగా నీకో వాలుకుర్చీ ఇష్టం ఉండి ఉండవచ్చు. వాలుకుర్చీనో 

ఎప్పుడూ నేలపై పడుకునే నీ తల్లికి, నేల నుంచి ఎగిసే చలికి వొణికే నీ తల్లికి, నువ్వు ఇంతకాలమూ కొనిద్దామని కొనివ్వని ఒక పరుపో, ఒక స్వెట్టరో కూడా అయ్యి ఉండి ఉండవచ్చు. చికిలించిన కళ్ళతో నీకై ఎదురుచూసే నీ తండ్రి కావొచ్చు. నలిగి నలిగి, నీకై కనులను తలుపులపై పరచిన నీ భార్య కావొచ్చు. పిల్లలు కావొచ్చు. నీలో నువ్వై కూరుకుపోయి ఏడ్చే వాళ్ళు కావొచ్చు. ఎవరైనా కావొచ్చు. మరి

నీకు ఇష్టమైన వాటి సంగతి సరే కానీ -నువ్వు ఇంతకాలమూ గమనించని- నిన్ను ఇష్టపడే వాళ్లకి నువ్వు, ఇక ఈ ఒక్క పూటకి ఒక వాలుకుర్చీయో, చేతి కర్రో, పాదు తీసి తమని తాము నాటుకోగలిగే ఇంత నల్లని మట్టో, ఈ చీకటిలో వెలిగించుకోగలిగే ఒక దీపమో అయితే ఎంత బావుండు-  

No comments:

Post a Comment