04 July 2013

నాన్న

'కంట్లో ఒక వర్షం చినుకు  బావుండు - వర్షిస్తున్నప్పుడు-'

వర్షం కవిత్వం- రెండు కనులనూ మేఘాల్లా విస్తరింపజేసి 
నిర్మలమైన కనులపాపలతో వర్షం కోసం ఎదురుచూడటం కవిత్వం-
ఆ రెండు కళ్ళూ  నల్ల మట్టితో నిండి ఉన్న ఆకాశాలు- లేదా
జలధార కోసం అవిశ్రాంతంగా ఎదురుచూసే రైతులు- లేదా
ఆ రెండు కళ్ళూ గతించిన అతని తండ్రి బాహువులు-లేదా
నాన్న రెండు కళ్ళూ, నాన్న ఊహ తెలీనప్పుడు కోల్పోయిన
పాలతో తొణికిసలాడే తల్లి వక్షోజాలు- వేసవి కాలం నిర్విరామంగా పరుచుకుపోయి
కోసుకుపోయే ఒక అంతు లేని తెరలా విస్తరించుకున్నప్పుడు

నాన్నకో చిన్న కోరిక: "ఈ కంట్లో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నప్పుడు"

ఇదొక జీవంతో తొణికిసలాడే కారణం అతను కవి కావడానికి-
వేచి చూడటం, అబ్బురం నిండిన చిన్న పిల్లాడి కనులతో ప్రపంచాన్ని చూడటం:
అదీ కవిత్వం- వర్షం కవిత్వం. వర్షం కోసం ఎదురు చూడటం కవిత్వం

వేసవి కాలం అంచున నిలబడి, రాబోయే వర్షాకాలం
బహుమతిగా పంపించిన ఒక మేఘమయపు వర్షపు దినాన
వానపాము వలే భూమిలోకి తొలుచుకుపోయి లేదా
శరీరమే భూమిగా మారిపోయి నాన్ననూ, నాన్న కోరికలనూ            
ఆ రెండు కళ్ళల్లో వర్షపు అలల్లా కొట్టుకులాడే కలలను గుర్తుకు తెచ్చుకోవడం కవిత్వం-
చినుకులొక్కటే కవిత్వం కాదు- అది అంతకు మించినది
నాన్నలా, తన స్పర్శలా లేదా నయనాలు విచ్చుకోనప్పుడు
తను కోల్పోయిన తన తల్లి స్పర్శలా-

మరి అతని తల్లి ఎలా ఉంటుంది-?

సుదూరంగా, అసంఖ్యాక వర్షపు తెరల సంవత్సరాల క్రితం కురిసిన ఒకానొక వర్షం-
ఊరిలో, వసారా ముందు, చూరు అంచులను తాకుతూ,  పేడతో అలికిన
మట్టి మీద రాలిన వర్షం చినుకు రాలిన బరువుకి
ఎండిన మట్టి, కొద్దిగా చలించి అదృస్యంగా చలించి
గాలిలోకి చేతులు చాచితే అతని తల్లిలాగా ఉంటుంది.
అందుకే నాన్నకో చిన్న కోరిక-

"కంటిలో ఒక వర్షం చినుకు రాలితే ఎంత బావుంటుంది- వర్షిస్తున్నప్పుడు-"

నీడలు కమ్మిన మధ్యాహ్నం, చెట్ల గుబురు కొమ్మలలోంచి
ఊయలలూగుతూ జారిపడిన పక్షి ఈక వలే
వర్షం వాలిన జ్ఞాపకం తప్ప, మరే జాడా లేక   
అమ్మనే పదం తప్ప మరే గుర్తులూ తోడు రాక
వర్షం వెలిసాక, లోకాన్ని చిన్ని మంటలా అదుముకునే ఎండలా
అతని వర్షం వెలిసిన కన్నుల్లో అమ్మ కొట్టుకులాడుతుంది-

వర్షంలోని ప్రతి చినుకూ అమ్మ లేక తడబడిన బాల్యంతోనూ
ప్రతి నిమిషం, మట్టిలోంచీ, తండ్రి గరకు హస్తాలలోంచీ
మొలకెత్తుతూ గడిపిన పసితనంలో మిళితమయ్యి
ఎదురుచూసే అతని కన్నులలో ప్రతిబింబిస్తుంది-

కాళ్ళ ముందు కురిసే ప్రతి చినుకులోనూ తల్లి రూపం
కళ్ళలో వాలకుండా మట్టిపై చిట్లిన ప్రతి చినుకులోనూ
తల్లి హస్తాలు. ఆ చినుకు లోకాలలో, తను తన తల్లితో గడిపిన ఐదారేళ్ళ పసితనం-
ఒకప్పుడు ఆమె తనకు చనుబాలు తాపిందన్న ఊహ
తనని రెండు కాళ్ళ మధ్య పరుండబెట్టుకుని స్నానం
చేయించిందన్న ఊహ.వర్షం ఊహ-చాలా కాలం క్రితం

తాటాకులు కప్పిన ఇంటి ముందు, అతను జన్మించక
ముందు, అతని తల్లికీ ఒక చిన్న కోరిక -"కంటిలో ఒక
వర్షం చినుకు రాలితే బావుండు-వర్షిస్తున్నప్పుడు"అని-

ఆమె స్వప్నించి ఉండవచ్చు. ఘాడంగా, వర్షానికి ముందు
భూమిపై బలంగా వీచిన గాలి తెరలా, రాత్రి పూట చిక్కగా అలుముకున్న చీకటిని
లోపల గదిలోంచి సన్నగా తాకుతున్న దీపపు కాంతిలో
గుమ్మం పక్కగా కూర్చుని, మబ్బులతో నిండుతనం సంతరించుకుంటున్న నింగిలా
బరువైన తన గర్భాన్ని ఆమె ప్రేమగా కలల అరచేతులతో కప్పి స్వప్నించి ఉండవచ్చు

"నా బిడ్డ కంటిలో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నప్పుడు-"

వర్షం చినుకొకటి మట్టిని తాకేంత సామీప్యంలో, ఆమెను మరణం చుట్టుకుంటున్నప్పుడు
ఆమె శరీరంలోని ప్రతి నెత్తురు చినుకూ మహోద్రేకంతో చలించిపోయి
ఒకే ఒక్క కోరికతో తపించిపోయి ఉండవచ్చు-'నేను చనిపోక ముందు
ఒక వర్షం చినుకు నా బిడ్డ కంటిలో రాలితే బావుండు-వర్షిస్తున్నప్పుడు'-

చాలా రోజుల తరువాత, మరో తల్లైన, అతని తండ్రి మరణించే ముందు
అతని తండ్రి కనులలో అద్రుస్యంగా కదులాడిన కల. వర్షం కల. నాన్నా
నువ్వది గమనించావా?నీ తండ్రి కనులలో కనిపించిన వర్షం.స్వచ్చమైన
ఆనంద సౌందర్యం వల్ల కదులాడిన వర్షం? నాన్నా అతను నీ కనులలో
ఒక స్వప్నాన్ని చూసాడు. వర్షిస్తున్నప్పుడు కంటిలో ఒక చినుకు మృదువుగా జారి పడటాన్ని

నీ కనులలో చూసాడు. ఆ చినుకులో నీ తల్లిని వీక్షించాడు
ఆమె కాంక్షించిన ఒక ఆప్తమైన కల, తనలాంటి సౌందర్యవంతమైన కల, నీ కనులలో
నిజమవ్వడాన్ని ఆనందపు వీడుకోలుతో గమనించాడు-
ఇక చాలా రోజుల తరువాత, నువ్వు మళ్ళా ఆనాటి ఆరేళ్ళ కళ్ళతో స్వప్నిస్తావు కదా

'కంటిలో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నపుడు-' అని
మరి నువ్వది గమనించావా? అరచేతుల్లా నువ్వు చాచిన నీ
కనులలోకి ఒక చినుకు రాలింది. మృదువుగా తాకింది. నీ
నయనాల సజలతనంలోకి కరిగిపోయింది. అది కవిత్వం-
నీ చుట్టూ ఉన్న మట్టిపై, నీ చుట్టూ ఉన్న మనుషులపై
లేతగా కురుస్తూ ఉంది. నువ్వు, నీ తల్లి ఒడిలో వొదిగిన
చిరునవ్వు వలే తాకుతూనే ఉంది. నువ్వు తపించిన నీ

బాల్యమంతా, తల్లి ప్రేమంతా, ప్రియురాలి చేతివేళ్ళ స్పర్సలా
తెల్లటి మబ్బులు తేలుతున్న ఆకాశంలాంటి, విప్పారిన నీ
కనులలోకి మట్టి పరిమళంతో ఒక చినుకై రాలి పడింది
అది కవిత్వం:నీ శరీరంపై వాలి,లోపలి నెత్తురు కొమ్మల్లో
అసంఖ్యాకంగా, గూళ్ళు కట్టుకుంటూనే ఉంది. నీ శరీరం

అణువణువులోంచి ఒక కలల పక్షి తొంగి చూస్తుంది- మరి నీకు తెలుసా
నీ శరీరం ఏమిటో? ఎగిరే పక్షుల కిలకిలరావాల సందడి-
విస్తరించిన మట్టి వృక్షాల వాన కొమ్మల అలజడి. మరి
నీ కనులూ, పెదాలూ, పాదాలూ, పదాలూ? అవి ఒక
నెత్తురు జలపాతం,ఒక వెన్నెల సాగరం.చూడు ఇటు

ఘాడంగా, ఆ చిక్కటి అరణ్యాలపై వర్షం కురుస్తున్నప్పుడు
నా చినుకుల వజ్రాలలోంచి,నేనూ ఒక స్వప్న బిందువుని   
దొంగలించాను. రహస్యంగా, నీకు తెలియకుండా,నేను ఒక
నెత్తురు చుక్కనూ, దాని పరిమళాన్నీ దొంగాలించాను.ఇక
ఇప్పుడు, నా రక్తం అలల నిండా మత్తుగా, బరువుగా కదిలే
ఒక కోరిక -'నా కంటిలో ఒక వర్షం చినుకు పడితే బావుండు- వర్షిస్తున్నప్పుడు-'
-------------------------------------------------------------------------
1997. 

No comments:

Post a Comment