30 June 2013

అంతే

గాలికి కొట్టుకుంటాయి కిటికీ రెక్కలు, ఒక మధ్యాహ్నం అప్పుడే జన్మించిన తేనె పిట్టలని చూసి నీ కనురెప్పలు రెపరెపలాడినట్టు - ఒక చెమ్మ నీ కనుబొమ్మల కిందుగా, మరి నక్షత్రాలేవో చమ్కీలై మెరిసిపోయినట్టు. పని చేసుకుని వచ్చావు కదా అప్పుడే, మరి

శ్రమ కూడా మెరుస్తుందని తెలిసింది నాకు ఆనాడే. కానీ ఇలా చెప్పనా నేను నీకు,ఈ రోజు? ఆ రోజేమో నీ చేతులు, నన్ను అల్లుకున్న గూళ్ళు-తోటలోనుంచి నువ్వు కోసుకు వచ్చిన తాజా ఆకు కూరలు. మెరిసాయి ఆనాడు నీ చేతులు ఒక చల్లటి మట్టి వాసనతో. ఎలా అంటే నీ శరీరమే ఒక పూలపొదై, ఇక్కడ నా ఛాతిలో, వానలతో విరగ బూసినట్టు-మరి

అవేమి పూవులూ అని, అవేమి ఆకులూ అని నువ్వు అడిగితే నాకూ తెలియదు. పక్షుల రవళుల కింద లతలేవో నెమ్మదిగా అల్లుకున్నట్టు, నా చేతివేళ్ళని ఆనాడు చుట్టుకున్న నీ చేతివేళ్ళ జ్ఞాపకం- ఇప్పుడు కనిపించని ఒక గాయం- ఇక ఏమీ చేయలేక 

ఇలా కిటికీ పక్కన కూర్చుని ఉంటే, వేగంగా రుతువులు మారాయి. ఆకులు రాలిపోయాయి. గూళ్ళని వొదిలి పిట్టలూ ఎగిరిపోయాయి. చెట్ల కిందుగా పడి ఉన్న- ఎవరూ తాకని -విరిగిన ఖాళీ మట్టి కుండల వలే, నా అరచేతులు మిగిలాయి-

"సరే, సరే, అది సరే కానీ, అంతిమంగా నువ్వు చెప్పొచ్చేది ఏమిటీ ఇంతకు?" అని మీరు నన్ను నిలదీసి అడిగితే , ఏమీ లేదు. ఇక్కడ. మృత్యుశయ్యపై ఉన్న శిశువుని ఆఖరి సారిగా చూసుకుంటూ ముద్దాడే ఒక తల్లి శ్వాస. ఉగ్గ పట్టుకుని తన చుట్టూ తిరిగే గాలి. కొంత నిశ్శబ్ధం. కొంత దిగులు. మరి కొంత, ఇలా గడచిపోయే కాలమూ, వాలిపోయే ఆకాశమూనూ- 

ఏంటంటే, ఈ రోజు ఇక్కడిలా ఊరికే, వీటన్నిటితోనూ, వీటన్నిటిలోనూ 'ఉన్నాను' అనే స్పృహ బావుంది- అంతే. ఇంకేం చెప్పను?  

1 comment:

  1. ఈ స్పృహ నాక్కూడా చాలా బాగుందండి.

    ReplyDelete