21 June 2013

కొందరి కథ

"జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా సున్నితం - వదిలి వేసావో
రాలి పడుతుంది. ముక్కలవుతుంది. అసంఖ్యాకంగా
-ఏరివేసినా కనిపించని గాజుముక్కలు - తిరిగి నిన్నే గాయపరుస్తాయి"

పై మాటలు చెప్పి అతను
మృదువుగా ఆ పిల్లవాడి లేత వేళ్ళ మధ్య సౌందర్యవంతమైన గాజుగ్లాసుని
వాన నీటిపై కాగితం పడవని వదిలినట్టు జార విడిచాడు.
ఆ పిల్లవాడి వేళ్ళు వర్షం పాయలు. వర్షపు పాయలపై తూగుతున్న
గాజు గ్లాసు పడవను విచ్చుకున్న కళ్ళతో చూస్తున్నప్పుడు
మళ్ళా చెప్పాడు అతని తండ్రి:

"ఇది అధ్బుతమైన జీవితం. దేనితో తయారవుతుందో తెలుసా ఇది?
పారదర్శకమైన, నీటి పోరలాంటి ఈ గాజు గ్లాసు? గరుకైన  ఇసిక నుంచి-
అధ్బుతం కదా. జీవన సౌందర్యమిది - కటినమైన వాటి నుంచి
సున్నితమైనవి జన్మిస్తాయి. నిజానికి, ఇసిక కూడా
చిగురాకులంత మెత్తగా ఉంటుంది: నువ్వు గమనించగలిగితే-"

అతను (ఆ పిల్లవాడు)
మృదువుగా వేళ్ళ మధ్య తెల్లటి పావురంలా వొదిగిపోయిన గాజు గ్లాసుని
గమనించాడు. అటుపిమ్మట, ఎటువంటీ తొందరపాటూ లేకుండా
దానిని గాలిలోకి వదిలి వేసాడు. వాన చినుకు వోలె
అతని వేళ్ళ మధ్య నుంచి జారి నేలపై  వాలి తునాతునకలయ్యింది అది.
అటుపిమ్మట, అతను నేలపై ముత్యాల్లా అల్లుకుపోయిన
సాగర తీరాన ఇసికపై మెరిసే అలల తడి వంటి గాజుగ్లాసుముక్కలను
జాగ్రత్తగా ఎరివేసాడు. అయినప్పటికీ కనిపించని తునకలు
అతని పాదాలలోకి విత్తనాల వలె నాటుకు పోయాయి. చిన్నగా
నెత్తురు మొక్కలు మొలకెత్తాయి. అతను ఏడ్చాడు - కానీ
ఎవరికీ చెప్పలేదు, తాను రోదించినది నొప్పి వల్లనా లేక ఆ

గాజు గ్లాసు పగిలిపోయినందుకా అని- ఇక అప్పుడు, అరచేతుల మధ్య
అతను ఏరిపెట్టుకున్న గాజు తునకలు అతని కన్నీటి కిరణాలు పడి మెరిసాయి-
అతను (ఆ పిల్లవాడు)  అనుకున్నాడు: గాజుగ్లాసు పగిలినప్పుడు కూడా
సౌందర్యవంతమే అని, నిజానికి అది పగిలి తునాతునకలైనప్పుడే
మరింత సౌందర్యవంతమని.  అతను ఆ విషయం తన తండ్రికి చెప్పలేదు
చెప్పి ఉంటే తన తండ్రి చెప్పి ఉండేవాడు- ఒక మనిషి సౌందర్యం
పగిలి ముక్కలు ముక్కలుగా విస్తరించినప్పుడే తేలుస్తుందని -అయితే
బాల్యంలో అ పిల్లవాడు మరొక విషయం గమనించలేదు
అదేమిటంటే, ఆ గాజు గ్లాసు హృదయం కూడా కావొచ్చునని-
II
చాలా సంవత్సరాల తరువాత అతను (ఆ పిల్లవాడు) గమనించాడు, హృదయం
కూడా సున్నితమయినదని. ఎప్పుడు? అతని ప్రియురాలు
ఒక పుష్పాన్ని ముళ్ళ కంపల మధ్య, చాలా జాగ్రత్తగా, పూరేకులు
గాయపడకుండా ఉంచినట్టు, అమె హృదయాన్ని, అతని అరచేతుల మధ్య ఉంచి
ఇలా అన్నది: "ప్రేమగా ఉంచుకోవాలి. చాలా సున్నితం-
వొదిలి వేసావో, రాలిపడుతుంది. ముక్కలవుతుంది.ఇక

అసంఖ్యాకంగా, ఏరుకున్నా కనిపించని తునకలు నిన్నే గాయపరుస్తాయి"-
అతను మృదువుగా, తన దేహంలో-తల్లి బాహువుల్లో వొదిగిపోయిన
పాపలాంటి- సురక్షితంగా దాచుకుందనుకున్న ఆమె హృదయాన్ని
ఎటువంటీ తొందరపాటూ లేకుండా జార విడిచాడు.అతి సులువుగా

ధూళి అంటిన చేతులని తుడుపుకున్నట్టు, అతి మామూలుగా తన
హృదయాన్ని జార విడిచాడు. ఈ సారి ఏరుకునేందుకు
సుస్థిరమైన గాజు తునకలేమీ లేవు. దేహం నిండా కనిపించని గాయాలు.
ఎక్కడ తాకినా, ,మెత్తగా అంటుకునే నెత్తురు పరిమళం.
ఆమె శరీర పరిమళం.కానీ అతను గమనించాడు.మనిషి

సౌందర్యం, మనిషి తునాతునకలయ్యినప్పుడే తెలసి వస్తుందని. కానీ
నిజానికి ఇక్కడ, తునాతునకలయ్యింది  ఎవరు?  తన
అరచేతులలో ముక్కలుగా మొలకెత్తుతున్న ఇరువురి
జీవితాలలోని సౌందర్యాన్ని గ్రహించాడు. కానీ, విడవని
మరొక సందేహం: పగిలిన తరువాత ఏరుకున్న గాజు ముక్కలు కొన్ని
తన అరచేతులలో ఉన్నాయి.మరి కనిపించక గాయపరిచే
గాజు తునకలు ఎవరి వద్ద ఉన్నట్టు?
III

ఆతని తల్లి నవ్వి చెప్పింది: "నా వద్ద" అని, తను తన హస్తాలను
చాపి చూపింది. ఏభై ఏళ్ల అరచేతుల మధ్య, నెత్తురు మరకలు-
"నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి. నువ్వు గ్రహించడం మరచిపోయావు
కనిపించక గాయపరిచే తునకలు నిన్ను మాత్రమే కాదు
నిన్ను ప్రేమించే వారందరినీ గాయపరుస్తాయి. మరి నువ్వేం చేయాలంటే

ఆ గాయాలలోంచి ఒక ఇల్లుని నిర్మించుకోవాలి. గాయాలను
మాన్పుకోవడం కాదు.గాయాలను ప్రేమించడం నేర్చుకోవాలి
ఇది ఒక అద్భుతమైన జీవితం. జీవితం ఒక సంఘర్షణ లాగే
ప్రేమించడం ఒక సంఘర్షణ. ప్రేమించడం, ఒక సాధన-" అని
అతని తల్లి తన పెదాలతో అతని గాయాలని ముద్దాడింది-

అతను అప్పుడు తొలిసారిగా తన తల్లిని కడు ఓరిమితో గమనించాడు-
తన తల్లి నగ్న దేహమ్మీద అసంఖ్యాకమైన గాయపు కోతలు
తన తల్లి తండ్రుల నగ్న దేహాల మీదైన, ఆ గాయపు కోతల్లో
తను మృదువుగా జారవిడిచిన గాజు గ్లాసు పగిలిన తునకలు

కొన్ని దిగబడి, నెత్తురు ఊటలా ఉబికీ, ఎండిపోయిన ఛాయలు
మరికొన్ని పచ్చిగా, అప్పుడే వాడిగా దిగబడిన పలుగుల వంటి
పదునైన తునకలు. ఇక, చూస్తుండగానే (ఆ పిల్లవాడు) అతని
కనుల ముందు, ఆ రెండు నగ్న శరీరాలు రెండు మహారణ్యాలుగా మారినాయి-
అనాగరికమైన సౌందర్యంతో, అసంఖ్యాకమైన పక్షుల కిలకిలలతో
జలపాతాలతో మృగాలతో నదులతో మరణించిన అసంఖ్యాకమైన             
వదనాలతోనూ తుళ్ళిపడసాగినాయి. అతను మృదువుగా కదిలి

ఆ రెండు నగ్న దేహాలనూ ముద్దాడి ఇలా చెప్పాడు: "అవును. నిజం.
జీవితం వలే, ప్రేమించడం వలే, శాంతి ఒక సంఘర్షణ. శాంతి ఒక సాధన-"  
------------------------- 
05/03/1997. రాత్రి 01:15

4 comments:

  1. చాల బాగుంది.వృత్తం. గాజు గ్లాసు వదనంలా పద్యమూ వృత్తమే. ఎక్కడ మొదలెట్టినా మొదటికే.

    ReplyDelete
  2. ఆ గాయాలలోంచి ఒక ఇల్లుని నిర్మించుకోవాలి. గాయాలను
    మాన్పుకోవడం కాదు.గాయాలను ప్రేమించడం నేర్చుకోవాలి
    ఇది ఒక అద్భుతమైన జీవితం. జీవితం ఒక సంఘర్షణ లాగే
    ప్రేమించడం ఒక సంఘర్షణ. ప్రేమించడం, ఒక సాధన-" అని
    అతని తల్లి తన పెదాలతో అతని గాయాలని ముద్దాడింది- <3

    ReplyDelete
  3. అధ్బుతం కదా. జీవన సౌందర్యమిది - కటినమైన వాటి నుంచి
    సున్నితమైనవి జన్మిస్తాయి. నిజానికి, ఇసిక కూడా
    చిగురాకులంత మెత్తగా ఉంటుంది: నువ్వు గమనించగలిగితే-"
    *****
    ఆ గాయాలలోంచి ఒక ఇల్లుని నిర్మించుకోవాలి. గాయాలను
    మాన్పుకోవడం కాదు.గాయాలను ప్రేమించడం నేర్చుకోవాలి
    ఇది ఒక అద్భుతమైన జీవితం. జీవితం ఒక సంఘర్షణ లాగే
    ప్రేమించడం ఒక సంఘర్షణ. ప్రేమించడం, ఒక సాధన-"
    ***
    hmmmmm
    I feel

    ReplyDelete