10 June 2013

ఘోష

1
వెళ్ళిపోకు నువ్వు . నువ్వు వెళ్ళిపోతే
ఈ కాగితం కూలిపోయి ఒక శూన్యం మొదలవుతుంది
నాకు శూన్యం అంటే భయం లేదు-
కాకపోతే, నువ్వు వెళ్ళిపోతే, ఈ శూన్యానికీ అర్థం ఉండదు- అందుకే
2
ఇప్పుడీ రాత్రి గడిస్తే చాలని నాకు నేను చెప్పుకుంటాను. అయితే

చుక్కలు కూడా లేని చీకట్లో, కత్తులై ఊగుతున్న గడ్డి పరకలపై
కుత్తుకలని కోసుకుంటున్న మంచు బిందువులు
చల్లటి రక్తంతో నీ అరి పాదాల్ని తాకాక అక్కడలాగే
తటాలున పొలాల చివర తాడి చెట్టు కింద కూలబడి

 నేను వెళ్ళలేనంత దగ్గరలో ఉన్న
పాక లోంచి ప్రాణమై మెరుస్తున్నలాంతరు కాంతివైపు చూస్తూ

ఇప్పుడీ క్షణం గడిస్తే చాలని నాకు నేను చెప్పుకుంటాను-అయితే
3
నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలూ ఇక ఏమీ లేవు

ప్రేమా కరుణా హింసా దయా దు:ఖమూ, అన్నీ
నువ్వు నిదురించలేని ఒక రాత్రిలోనే తేలిపోతాయి

నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలన్నీ, నీ నిదురలోకి
రాలేని పూల జోల పాటలపై మెరిసే
సూర్యరస్మితోనే తగలబడి పోతాయి

ఇక నీకు ఏమన్నా ఉంటే, అది
దుప్పటి కూడా లేని ధూళీ నేలా
పూర్వజన్మలో మమకారంతో తాకిన ఆ స్త్రీ వక్షోజం
అలల నురుగ ఘోష లాంటి నీ బిడ్డ చివరి నవ్వూ

నువ్వూ నీలోపల కోన ఊపిరితో తచ్చట్లాడుతున్న
మంచు మరణమూనూ- అందుకని
4
నీ ఊపిరికై నీ వద్దకు వస్తాను నేను-

నీవు లేనితనంలో నీ ఉనికిని వింటాను నేను. ఎవరో వొదిలి వెళ్ళిన
గులాబి నీడ, గులాబీని వింటున్నట్టు
నీవు లేనితనంలో నీ ఉనికి నిశ్శబ్దాన్ని వింటాను నేను

నీ ఊపిరికై నా వద్దకు వస్తాను నేను

పదాల నీడలలో, ఎవరూ తాకని, నీ శాశ్వతమైన తాత్కాలికపు
మరణపు పెదాలను రుచి చూస్తాను నేను
విరిగిన శిలా విగ్రహాలు ప్రాణం పోసుకుని, చీకటి పూట
ఈదురుగాలుల వంటి ఊపిరులతో
ఒంటరి నక్షత్రం వైపు తపనగా చేతులు చాచినట్టు, నీలోని
తడిని తదేకంగా చూస్తాను నేను

నీ ఊపిరికై ఈ ప్రపంచం నుంచి వెడలిపోతాను నేను

ఖాళీ గూళ్ళలో ఒదిగి ఉన్న అంతిమమైన అసంపూర్ణ అర్థంలాంటి
నీ సారాంశాన్నీ, సత్యాన్నీ
నీవు లేని చోట మాత్రమే కనుక్కుంటాను నేను. గాలిపై గాలి
నీడపై నీడ
జాడపై జాడ
సర్వత్రా వ్యాపించి మరణంతో జన్మిస్తున్న భాష. చూడు

నీ ఊపిరికి నీ వద్దకు వస్తాను నేను, ఇక్కడికి-
5
ఎవరూ రాలేదు ఇంకా ఇక్కడికి, ఈ ఎండిన

మట్టి వీస్తున్న సాయంత్రాన
ఎవరూ తాకని నీ సమాధి వద్దకు వస్తావు నువ్వు-

రాలిన పూవులు పలుకరిస్తాయి నిన్ను. తలలులేని
శిలావిగ్రహాలు పిలుస్తాయి నిన్ను
అమావాస్య సంధ్యా సమయాన, రహస్యమైన చేతులు
తాకుతాయి నిన్ను

ఎవరూ రాలేని ఇక్కడికి, ఈ ఎండిపోయిన

ఊపిరి వీస్తున్న సాయంత్రాన
ఎవరూ తాకని నీ సమాధి వద్దకు వస్తావు నువ్వు- మరి
6
ఇతర క్షణాలలో నీకు కనిపించి, నీవు నివసించిన
ఇక లేని, రాని
నువ్వు తపించే ప్రదేశాలలోకి ఎలా వెళ్ళగలవు నీవు-

నీ ఉనికి
వికసిస్తున్న పూవులా ఉండిన గాలిలోకి
నక్షత్రంలా మెరిసే నీటి చినుకులోకి
నిశ్శబ్దంగా, నిన్నుఓదార్చుతున్న ఆ స్త్రీ తెగిన అరచేతులలోకి
పాలిపోయిన నీడల లాంటి
నీ స్నేహితుల ఊపిరి తెగిన జాడలలోకీ

ఇతర క్షణాలలో నీకు కనిపించి, నీవు నివసించిన
ఇక లేని, రాని
నువ్వు తపించే ప్రదేశాలలోకి ఎలా వెళ్ళగలవు నీవు? అందుకే
7
దూరం చేయబడ్డ దిగులు ఇది-

దూరం చేయబడి, దారి తప్పి, తీరం లేక
ఎప్పటికీ గూడును చేరుకోలేక
గోడకు తల మోదుకుని మరణించిన
దూరం చేయబడ్డ పక్షి దిగులు ఇది

కాంతిలేని నీడ కమ్ముకున్న మధ్యాహ్నం
నీ హృదయంలో ఎవరో
నీరు లేని నల్లని చెపపిల్లయై విలవిలలాడతారు
నీ అస్తిత్వాన్ని ఎవరో
కరుణ లేక కత్తితో రెండుగా చీలుస్తారు
ఎవరో నిన్ను
ధూళిలా గాలిలోకి వెదజల్లి, నిన్నుగా
మిగులుస్తారు నిన్ను- ఇదంతా

దూరం చేయబడి, దారి తప్పి, తీరం లేక
ఎప్పటికీ గూడుని చేరుకోలేక
నీటిలో దేహాన్ని ముంచుకుని మరణించిన

దూరం కాబడిన నీ దిగులు ఇది- అందుకు
8
ఆకాశపు అంచుపై రాలిపోక మిగిలి ఉన్న
ఆఖరి నక్షత్రం పిలుస్తుంది నిన్ను-

గాలి తాకక, గూడు పిలవక
దారీ తెన్నూ లేక రాత్రిలో కనుమరుగైన పూవువి నీవు
అందరూ వదిలివేసిన
తపించే కీచురాయి సంగీతానివి నీవు

విను
సన్నగిల్లుతున్న
సుదూరపు దీపపు ఊపిరి కాంతిని
అనంతంగా సాగి ఉన్న
నీ అంతిమ ప్రయాణపు, నీవే అయిన
అద్రుశ్యపు మట్టిదారిని

అది
రంగుల శబ్దం, పదాల నిశ్శబ్దం
నీవు వేయని నీ అస్తిత్వపు కంపించే మంచు చిత్రం-
మరి
9
ఇంతకుమునుపే ఈ పాటను విన్నావు నీవు-

భూమి పొరలలో ప్రవహించే నీటి నెత్తురు చలనాన్ని
ఆకస్మికంగా నీ ఉనికితో విన్నట్టు
ఈ పాటను ఇంతకు మునుపే విన్నావు నీవు
లోయలోకి జారుతున్న ఆకు వలే
నీ అస్తిత్వం నిర్భయంగా
వినీలాకాశంలో స్వేచ్చగా కదులాడే పక్షి రెక్కలపైన
ఊయలలూగుతున్నప్పుడు

నీ లోపలి పాటను విభ్రమంతో విన్నావు నీవు-

వర్షం కురిసే రోజులలో, నీడ కమ్మిన మధ్యాహ్నాలలో
మోహంతో నిన్ను పిలిచినా నక్షత్రాలను నువ్వు
నవ్వుతూ తాకిన వేళలలో, ఎవరూ లేని రాత్రుళ్ళలో

నీ లోపలి పాటని వింటూ పాటగా మారావు నీవు
నీ లోపలి పాటని వింటూ నీవుగా మారావు నీవు
అది

నిశ్శబ్దాలకి నిశ్శబ్దం
పాటలకి పాట మాటలకి మాట
నా వైపు చూడు
ఈ శబ్దరహితపు పాటను ఇంతకు మునుపు విన్నావు నీవు. మరి
10
బాటసారీ
నీరు లేక దుమ్ము పట్టి రంగు మారుతున్న ముదురు ఆకుల మధ్య
తలి వర్షానికి వెదుక్కుంటావు నీవు
యుగాల నుంచి పిల్లల కళ్ల లాంటి కాంతి కదలికలు లేక
శిలల్లా మారిన ఆకుల నిశ్శబ్దం మధ్య
నీకై వెదుక్కుంటావు నీవు

పిల్లల తుళ్ళిపడే నవ్వుల జాడ లేని వృక్ష ప్రాంతం ఇది
పదాల పొత్తిళ్ళలో ఒదగ లేని
నల్లటి మంచు కురుస్తున్న, పెదాలు తెగిన మరణం ఇది

బాటసారీ

నువ్వు వెదుకుతున్న స్వప్నాంతపు దారిని కనుగొన్నావా
చెదిరిన నీ ఎదురు చూపుల కళ్ళను
ఏ రెండు అరచేతుల సెలయేరులోనైనా కడుక్కున్నావా
ఏ దేహపు ఒడ్డునైనా చేరగిలబడి
నక్షత్రాలు నెమ్మదిగా సంధ్యాకాశాన్ని చీకటి దారంతో
అల్లటం గమనించావా

బాటసారీ

నీరు లేక, దుమ్ము పట్టి రంగు మారుతున్న లేత ఆకుల మధ్య
తొలి వర్షానికై వెదుక్కుంటావు నీవు
యుగాల నుంచి పిల్లల బాహువుల వంటి కాంతి స్థిరత్వం లేక
శిలల్లా మారిన ఆకుల గుంపుల శబ్దాల మధ్య
నీ నిశ్శబ్దంకై వెదుక్కుంటావు నీవు. అయినా
11
దేహసారీ
నువ్వొక నదిలేని పాటవి. ఎవరూ కనుగొనని
ప్రాచీన లిపివి
తొలి వర్షానికై సంచరించే రక్త గాయపు గాలివి.

నిన్ను
నువ్వు కోల్పోయినపుడు మాత్రమే
నిన్నునువ్వు కనుగొంటావు
అన్ని దారులను వొదిలివేసినప్పుడు మాత్రమే
నీ దారిని నీవు చూస్తావు-

రా మరి
12
ఈ దిగులు నీకే తెలుస్తుంది

సముద్రపు సారాంశం అంతా మట్టిని తాకి చిట్లుతున్న
వర్షపు చినుకులో ఇమిడిపోతుంది
నిరంతరంగా, కనిపించీ కనిపించకుండా వీస్తున్న
గాలి గాజుల చేతుల అభద్రతా అంతా
వెన్నెల రాత్రిలో ఎగురుతున్న పక్షి రెక్కల కింద ఒదిగిపోతుంది
అనంతపు నక్షత్రాల నిశ్శబ్దం అంతా
ఒక పిల్లవాడి అసంకల్పిత నవ్వు చివర పిగిలిపోతుంది
విశ్వాలలో కదులాడుతున్న రహస్య కాంతి అంతా
నిశ్శబ్దంగా సమస్తాన్ని ఎరుకతో గమనిస్తున్న
నీ కళ్ళ అంచులలో ప్రయత్నరహితంగా వాలిపోతుంది

స్పర్శలకు స్పర్శా
పూలకి వేకువా
ఊపిరులకి ఊపిరి

ఇక్కడికి రా నువ్వు

ఈ దిగులు నీకే తెలుస్తుంది. ఎందుకంటే
13
ఎవరూ తాకక నిశ్చలంగా నిలబడి ఉన్న ఈ ముల్లు
నీ ఆప్త మిత్రురాలు

సంధ్యాస్తమైన ఆ వింత సమయాన, పసిపాప కన్నుకంటే
సున్నితమైన ఆ లేతముల్లు ముందు మోకరిల్లి ప్రార్దిస్తావు
నువ్వు:

"రాత్రిపూట మసక వెన్నెల్లో చలించే దేవతవి నీవు
నీ సరళమైన ఉనికి వల్లనే
విచ్చుకునే పూవుల వివిధ రంగులు సాధ్యమయినాయి
నీవున్నావు కనుకనే
నా పాదాల వెంట సాగే నా తల్లితండ్రుల నీడలు
ఊపిరి పీలుస్తాయి
ఇది  చెప్పు నాకు
నేను నీలా మారటం ఎలాగో?

జవాబు:

"నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-

ఈ శూన్యపు పుష్పాన్ని, నిండైన నీ స్త్రీకి
బహుమతిగా ఇవ్వు. ఆ తరువాత నీకే దయగా తెలుస్తుంది
స్త్రీలూ, పుష్పాలూ ఒకటే అని
పుష్పాలూ ముళ్ళూ ఒకటేనని
శూన్యం, శూన్యారాహిత్యమూ మృత్యుపక్షి విదిల్చే
రెండు అనంతపు రెక్కలని.

నిశ్చింతగా గాలిలో తేలు, గిరికీలు కొడుతూ నేలపై వాలి
నాట్యమాడు. నీటిని స్పృశించు, గాలిని పరామర్సించు
నీలోపల నీవు విశ్రమించు-
ఇదీ జీవితం, ఇదీ జీవించడం
ముల్లులా ఉండటమంటే ఇది:
నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-"
14
కూర్చో, కొద్దిసేపు అలా విరామంగా

ప్రేమమయపు అలసటతో ఆగిన వర్షాకాలపు తెమ్మెరలా
కొద్దిసేపు అలా, ఊపిరి పోసుకుంటున్న కలలా
ప్రశాంతతతో, నీతో నువ్వు కూర్చో: ఏమీ ఆలోచించకు
పక్షిలా, అన్నిటినీ వదిలివేసి నీ రెక్కల్ని విదుల్చు.

నీ చుట్టూ ఉన్న కాంతినీ, చీకటినీ
ఆ ప్రమిదెపు ఆఖరి చూపునీ, నీ అస్తిత్వపు నాలికతో చప్పరించు.
నీకు తెలుసు: ఈ జీవితంలో జీవించేందుకు
నువ్వు మరణించేముందు మరణించాలి. ఆ తరువాత
సాధ్యం అవుతాయి అన్నీ. మరి నక్షత్రాలూ
పాల పొదుగులాంటి వెన్నెలా, దయగా నవ్వే

సూర్యుడూ, వర్షం, హర్షం, ప్రతిధ్వనిస్తున్న
శిశువు నవ్వులాంటి నువ్వూ, నీ ఆఖరి మొదటి అస్థిత్వమూనూ- కానీ
15
కొమ్మల మధ్యగా చలికాలపు ఎండా, ఆకుల నీడా కదులాడుతున్న
శంఖంలాంటి గూటిలో
సగం పొదిగిన గుడ్లను నువ్వైతే వొదిలి వెళ్లావు కానీ
నేను ఎలా వొదిలి వెళ్ళగలను? సరే,
16
ఎదురుగా నిశ్చలంగా ఉన్న ఎండిన ఆకు, ఒక పాటా ఒక నది.

పాట వెంటా, నది వెంటా, ఆకుపచ్చని సూర్యరశ్మి కిందుగా
సర్వాన్నీ మరచి వెడతావు నీవు.
దారి మధ్యలో, ఏ ఒడ్డునో సగం తడిసిన గవ్వ లాంటి పదం
దొరుకుతుంది నీకు. విశ్వం అంతా

నిక్షిప్తమైన, శంఖంలాంటి రహస్య సారాంశం దొరుకుతుంది నీకు
అలకూ అలకూ మధ్యగా ఉండే ఘాడమైన నిశ్శబ్దంలాంటి
నువ్వు దొరుకుతావు నీకు. ఎండిన ఆకు గీతాల మధ్యగా
కూర్చుని, సన్నటి నీటిపాయపై ప్రయాణించడం ఒక పాటా,
ఒక ఆటా. అందుకే

నిన్ను నువ్వు వదులుకోకు. ఆ లేత చేతిని ఎప్పటికీ మరచిపోకు. చూడు
17
-ఈ సమాధి నీ పూల అస్థిపంజరం-

నువ్వు ఇక్కడ జీవించావు. నువ్వు,  ఇక్కడ ప్రేమించావు.
నీ స్త్రీకై నీ రక్తపు బొట్లతో ఒక హారాన్ని తయారు చేసావు.
నీ పిల్లలకై, నీ హృదయాన్ని
వాళ్ళ పాదాలలో తురిమావు.

-ఈ సమాధి నీ పూల అస్థిపంజరం-

నువ్వు ఇక్కడ విశ్రమించావు. నువ్వు ఇక్కడ ప్రయాణించావు
నువ్వు ఇక్కడ, నీ మూగ తల్లి తండ్రుల లాగే
ముసలివాడివయ్యావు.నీ అలసిన ఎముకలతో
ఈ ప్రదేశంలో, ముక్కలు ముక్కలుగా మరణించావు.
జ్ఞాపకం లేదా నీకు

ఈ సమాధి నీ పూల అస్థిపంజరం. అది సరే కానీ, ఇది చెప్పు నాకు-
18
నీడల మధ్య జీవిస్తావు నువ్వు. అందుకని నీకు
నీడలా కరుణా, కాంతీ, హింసా అర్థమవుతాయి.
అందుకని నువ్వు

నీడలకు, చీకటిపూట కథలు చెప్పి నిదురపుచ్చుతావు.
అవి నిదురిస్తాయి. నిదురలో కంపిస్తాయి.
ఆ కలలలో తమ నీడలు కనపడగా, అవి
ఉలిక్కిపడి లేచి కూర్చుంటాయి. రాత్రంతా

నిన్ను చూస్తూ కూర్చుంటాయి.
నాకు ఇది చెప్పు. నేను నీడనా కాదా?
19
జాగ్రత్తగా విను
రక్కలు తెగి గిరికీలు కొడుతూ రాలిపోతున్న
అనాధ సీతాకోకచిలుక వినిపించని అరుపు.

అది ఎవరు?
20
వృక్షాల నీడలు కమ్ముకున్న నక్షత్రాలు కూడా లేని
రాక్షస రాత్రిలో, ఊపిరికై రెక్కలు కూడా లేని ఒక పక్షి
గదంతా నిస్సహాయంగా గిరికీలు కొడుతుంది.

నీ అరచేతులలో సన్నటి నిప్పుని బ్రతికించుకుంటూ వచ్చి
మూలగా మరెక్కడో, నీ హృదయపు తాకిడికై
తహతహలాడే ఆ పాత ప్రమిదెను వెలిగించు.

ఈ రాత్రికి, ఆ సంజకెంజాయ వెలుతురులో నా శ్వాసను
అందుకుంటాను. మరొక్కసారి నీ దయగల
పావురపు కళ్ళను చూస్తాను. మరొక్కసారి
నీ చేతులను నా అరచేతుల మధ్య పదిలంగా దాచుకుని
అలా నా ప్రాణాన్ని రేపటిదాకా నీ
స్పర్స మధ్య బ్రతికించుకుంటాను.
21
ఆ దినం, తెలియదు నాకు-

తెల్లని నిశ్శబ్దపు నీళ్ళు, నల్లటి రాత్రంతా
ఒక మంచుతుంపరయ్యి కురిసే వేళ్ళల్లో
నువ్వు
నా నిదురలోంచి మెత్తగా విచ్చుకుని
సూర్యు సాగరం  వైపు ఎగిరిపోయావో-
22
చిక్కటి చీకటి బూజు కప్పుకున్న చెట్ల మధ్యనుంచి
రాత్రంతా ఆ పిచ్చుక పిల్లలు
తమ లేత గొంతులు బొంగురుపోయేలా అరుస్తూనే ఉన్నాయి

సూర్యుడి పసుపుపచ్చని కనుపాపలవి
రాత్రి చంద్రుడి మైమరపు హృదయాలవి
నీడల నిశ్శబ్దాలతో
చెట్ల కిందుగా, పైగా
తమ తనువులతో ఆడుకునే శిశువులవి.

ఏం జరిగి ఉంటుంది?
గూటిలోకి గింజలతో, తల్లి తిరిగి రాలేదా?
జగమంతా ముడుచుకున్న త్రాచైనప్పుడు
నిప్పు కణికెల కళ్ళతో

ఏదైనా పిల్లి గూటి వద్దకు నిశ్శబ్దంగా కదులుతుందా?
లేదా ఒక పిచ్చుకపిల్ల అదిరీ, బెదిరీ, కదిలీ,
ఆకాశాన్ని పదునుగా కోస్తున్న నక్షత్రంలా
నేల రాలిపోయిందా?
ఏం జగిగి ఉంటుంది?

చిక్కటి చీకటి రక్తం జిగటగా కమ్ముకున్న చెట్ల మధ్యనుంచి
రాత్రంతా ఆ పిచ్చుక పిల్లలు
తమ లేత గొంతులు బొంగురుపోయేలా అరుస్తూనే ఉన్నాయి, కానీ
తెలుసా నీకు
23
గాలిలేని ఇటువంటి నల్లటి చీకటిలో
నలువైపులా చలిస్తున్న ఆ వేయి బాహువుల వృక్షాల కిందుగా
ఒరిగిపోతున్న మట్టి రేణువుని
మమకారంతో కౌగలించుకుని

అలా నిలబడి ఉన్న, ఆ నాలుగు రేకుల
నక్షత్రంలాంటి ఆ చిన్ని తెల్లపూవు చాలు
నువ్వు ఈ రాత్రికి జీవించి, రేపటి దాకా ఎలాగోలాగ బ్రతికి ఉంటాను కానీ,
24
వెళ్ళిపోకు నువ్వు . నువ్వు వెళ్ళిపోతే
ఈ శూన్యం దగ్ధమయ్యి ఒక కాగితం మొదలవుతుంది
నాకు కాగితం అంటే భయం లేదు-
కాకపోతే, నువ్వు వెళ్ళిపోతే, ఈ పదాలకీ అర్థం ఉండదు-
25
ఇక ఎవరు రాస్తారు, నిన్నూ, నన్నూ?

No comments:

Post a Comment