15 July 2012

వాన

తేలికగా ఈ వాన మొగ్గ ఇలా హాయిగా విచ్చుకుంటుంటే
ఆ పిల్లల కళ్ళల్లో చమక్కుమని
మెరుపులు మెరుస్తాయి- యిక

వాళ్ళ లేత శరీరాలపై చల్లటి గాలి వీచి
వాళ్ళ లేత ఎరుపు పెదాలపై
పచ్చిక తెరలేవో ఊగుతాయి-

మంచంపై ముంగాళ్ళపై కూర్చుని
కిటికీలోంచి అలా చేతులూపుతూ
అడుగుతారు కదా పిల్లలు అప్పుడు
ఎప్పుడో ఎక్కడో కోల్పోయిన నిన్ను-

'నాన్నా నాన్నా చూడీ వర్షం
ఎలా ఎగిరెగిరి గెంతుతుందో
ఎలా పడి పడి పారిపోతుందో
రా నాన్నా చూడటానికి-'.

అప్పడు, ఆ క్షణాన
తొలిసారిగా నీకు
ఈ వాన వెన్నెల

ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే
ఓ తేమ తేనె పిట్ట అనీ, ఒక
తుంటరి పిల్లనీ అర్థమయ్యి

అరిచే పిల్లలలోంచి ఏరుకున్న
కొన్ని ఇకిలింతలతో
పై పదాలు రాస్తావు-

యిక ఆ తరువాత
చెప్పడానికి నీకు
ఏం మిగిలి ఉంది?

1 comment:

  1. ఈ రోజు యాదాలాపంగా ఎఫ్.ఎం. విన్నాను. అందులో వానొచ్చినప్పుడు ఏమిచేయాలనిపిస్తుంది అనే టాపిక్ నడిచింది. ఎవరెవరో ఫోనులు చేసి ఎవేవో చెబుతున్నారు. నాకు వాన సంకలనం చేస్తే ఎలావుంటుంది అనుకున్నా. ఇంటికివచ్చి ఆన్ లైన్ లోకి రాగానే ఇదిగో ఇలా వానపై కవిత్వం. ఇక్కడనుంచే మొదలెడతాను. వాన కవిత్వ సేకరణ.

    ReplyDelete