చినుకుల పూలు రాలుతున్న
వాన చెట్టు కింద నిల్చున్నాం
నేనూ ఫిరోజ్
ఆ నీటి చెట్టుకి పూసిన చిక్కని
చీకటి చంద్రుడిని అలానే చూస్తో
అంటాడు కదా అప్పుడు తను ఒక మైకపు తన్మయత్వంతో
"భాయ్, మనం నిల్చున్న ఈ భూమి
ఒక సుందరమైన స్త్రీ వంటిది-ఈ చెట్లకీ
ఈ కుక్కపిల్లకీ ఆ పురుగులకీ పిట్టలకీ
ఈ రాళ్లకీ ఆ కొండలకీ మనకీ
జన్మనివ్వగలిగేదీ సాకగలిగేదీ
ప్రాణమున్న ఓ జీవమే కదా - భాయ్
ఈ భూమికి ప్రాణం ఉంది. అది
మనల్ని వింటుందీ కంటుందీ. భాయ్
ఇవాళ నాకు తెలిసింది
దైవం పురుషుడు కాదు
దైవం ఒక స్త్రీ-". యిక
ఆ అర్థరాత్రి రెండున్నరకి ఇంటికి వస్తూ
నాకే అర్థం కాదు, ఏడు పాత్రల విస్కీ
తాగాక, మరలా తలా మూడు బీర్లు
ప్రతీసారీ తనకీ నాకే
ఎందుకు అవసరం
పడతాయో, ఎంతకూ తీరని ఈ బ్రతుకు దాహమేమిటో!
No comments:
Post a Comment