20 July 2012

కబోధి

దూరమైనదేదీ దగ్గరగా రాలేదు

అందుకే గుర్తుకు వస్తుంది నీ ముఖం
ఈ రాత్రి వికసించిన మసక వెన్నెలలా-

వొంగి పూల పాత్రలో
నీ తోటలో పూసిన
తెల్లటి లిల్లీ పూలను ఉంచుతూ
నా వైపు తిరిగి చిన్నగా నవ్విన
ఆ సన్నటి సవ్వడే
యింకా యిక్కడ

చినుకుల చిలుకల కలకలంతో
మెత్తగా తేలికగా
కదులాడుతోంది-

యిక ఏం చేయను?
వాన కురిసిన రాత్రి

చీకటి వెలిగిన రోజా పూల కాంతిలో
చల్లటి చామనఛాయతో నీ ముఖం
వెచ్చటి నక్షత్రాలతో మెరిసిన, నేను
మోహించిన నీ తామర పూల శరీరమూ గుర్తుకువచ్చి

ఇదిగో ఇలా, నల్లటి కన్నీళ్ళతో ఓ అడవి మనిషి

ఈ పదాలను రాసుకుంటున్నాడు
ఆకస్మికంగా తనకు చూపు లేదని
గ్రహించి తల్లడిల్లే కబోధిలా-

No comments:

Post a Comment