10 July 2012

దుర్ధినం

ఎక్కడో తిరిగి, ఎక్కడో విరిగి
తవ్వుకున్న కళ్ళనే మళ్ళా
తవ్వుకుని తుడుచుకుని

దిక్కుతోచక దాహమయ్యి
దాహ
మయ్యీ ఆకలయ్యీ
యిక నీ ఆ తెల్లని రాత్రి గుడిసెలోకి

ఇంత మధువు కోసం
నీ హృదయంలోనింత
గంజాయి శ్వాస కోసం

ఆ అరవు తెచ్చుకున్న గదిలో
మోగే మృణ్మయ నాదాల ఒక
తంత్రీ తంత్రమై మంత్రించిన ఆ
ఆదిమ స్త్రీ సంతోష స్వరం కోసం

నీ కోసం నా కోసం మనని
మాన్పలేని ఆ చీకటి కోసం
ఈ బ్రతుకు భూగ్రహపు
గర్భశోక అనాత్మ కోసం

అందుకోసమో ఎందుకోసమో
వచ్చేవాళ్ళం మరి నాలోంచి
నీలోకి - నీలోంచి నాలోకీ
ఆ దూర అర్థ అద్దాలలోంచి
గింజుకునీ విదుల్చుకునీ వదిలించుకునీ- కానీ

రాకీ - మరి ఎందుకో
ఎవరూ లేక ఈ రాత్రి
సగం వెన్నెలై ఇలా అమావాస్యలా కాలిపోయింది-

No comments:

Post a Comment