ఇలా కూర్చుంటే
అలా చెట్లలో ఆగిన గాలి కదిలి
నీ చెంత చేరుతుంది - ఎగిరెగిరి
ఆ కొమ్మలని కదిపి పూలనూ చెరిపి
నిన్న రాత్రి కురిసిన వానను మళ్ళా
నీపై చిమ్ముతుంది - ఆనక ఎందుకో
ఓ మారు నీ ముఖాన్ని మెత్తగా తన
చేతుల మధ్యకు తీసుకుని నిమిరి
నీ అలసిన కళ్ళలోకి
నింపాదిగా చూస్తుంది-
యిక యిదే సరైన సమయం
అలసినా సొలసినా విసిగినా
నువ్వు ఇంటికి వీచాల్సిన
నీటి పరదాల పన్నీరూ కన్నీరూ అయిన రక్త సమయం.
లే యిక.
No comments:
Post a Comment