16 July 2012

మత్తిల్లి

'తాగని వారెవరో నాకు చూపించు'
అన్నాడు ఫిరోజ్ ఒకనాడు 'నేనైతే
ఎలాగూ లేత ఎరుపు గులాబీలతో మత్తిల్లే వాడిని కానీ'- అని.

ఎదురుగా మత్తిల్లి వెన్నెల
చుట్టూతా మత్తిల్లి తెమ్మర
కింద మత్తిల్లి తిరిగే భూమీ పైన మత్తిల్లి ఎగిరే నింగీ
మత్తిల్లి రాలే ఆ వానా
మత్తిల్లి మొలిచే మట్టి

మత్తిల్లి చిట్లే మొగ్గా మత్తిల్లి కురిసే గింజా
మత్తిల్లి మత్తిల్లి మత్తిల్లి ఆదిమ అనాధని
పసిపాపల పాల కలలతో
ప్రార్ధించే ఈ అనంత విశ్వం -

పచ్చికలో వాలిన మంచు రెక్కలని నిమిరి
ఫిరోజ్ వెర్రిగా నవ్వుతుండగా, యిక
రాత్రి చాపని చక్కా చుట్టుకుని నేను

దీపం లేని ధూపంలోకి ఒక పగటిలోకి
నా కళ్ళు తుడుచుకుంటో
తిన్నగా నడచే పోయాను-

No comments:

Post a Comment