శవం లాగా కూర్చుంటే
రాత్రంతా అరిచే పిల్లులు
తగువులాడుకుంటూ మైధునంలో రక్కుకుంటూ కొరుక్కుంటూ కొంత
నీకు తోడుగా ఉంటాయి-
చక్కటి బలిష్టమైన పిల్లులు
నిండు జాబిలిలానో వానలానో
నల్లటి పూల గుచ్చంలానో ఈ
ఇంటి ప్రాంగణంలో చీకట్లో వేపచెట్టు కొమ్మల్లో గాండ్రుమంటూ, అంతలోనే
చల్లటి దూది పాదాలతో గుర్ గుర్ మంటూ నిన్ను రాసుకుంటూ కదిలేఆ
చక్కటి బలిష్టమైన పిల్లులు
నీలాగే నీ శరీర వాంఛలాగానే
స్పర్శ లేకుండా ఉండలేవవి-
ఎన్నడైనా ఒర్వలేనంత విసుగొచ్చి అలా విసిరి కొడతావా కాలితో తంతావా
చటాలున కనులు ముడుచుకుని నీ నుంచి దూరంగా పారిపోతాయవి. నీ
లాగే వెనువెంటనే అన్నీ మరచి తిరిగి వస్తాయవి, ఒకప్పుడు పుష్టిగా ఉండి
ఇకిప్పుడు ఇళ్ళు కనుమరుగై
చదరపు భవంతులలో అప్పుడప్పుడు తచ్చట్లాడుతూ నీకు కనపడే
బక్కచిక్కిన పిల్లులు - అవి ఇళ్ళు లేని పిల్లలు. యిక రాత్రి యింత
దీర్గంగా సాగినప్పుడు, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు
ఒక మరణ నిశ్శబ్ధమే నీ అంతటా. పిల్లుల అరుపులు లేని
చీకటి సమాధే అంతటా.
యిది నిజమే. నీ హృదయమెప్పుడో
బావురుమన్న ఆ తెలుపూ నలుపూ పిల్లులుగా మారిపోయి
నువ్వు ఇల్లు ఖాళీ చేసిన నాడే
ఎక్కడో పూర్తిగా తప్పిపోయింది-
No comments:
Post a Comment