16 July 2012

కొన్నిసార్లు

దాహమయ్యి అల్లాడే కళ్ళతో
కనురెప్పలు తెరవలేక, ఏవో
నీకు మాత్రమే కనిపించే లోకాల గురించి

తడిలేని పెదాలతో ఏదోఏదో
భీతిగా చెప్పాలనుకుంటావ్
కదలాలేని చేతులతో వొణికే
నీ నిప్పుల శరీరంతో, కానీ తను

తన తనువంత, ఓ చల్లని అమ్మంత
అరచేయిని నీ కాలే నుదిటిపై వేసాక
రౌరవ నరకాలలోకి జారిపోతున్న నీ

ప్రాణం వాన తెరలతో ఈ
లోకంలోకి తిరిగివచ్చాక

మట్టికి పూసిన ఓ పూవుకీ
పూవుకి మెరిసిన ఓ పిట్టకీ
అలా రాత్రుళ్ళంతా నీ పక్కనే కూర్చుండిపోయిన
నల్లని చారాల ఎర్రని కళ్ళ

తనకీ, తన ఆ తనువుకీ
యిక నువ్వేం చెప్పగలవ్
యిక నువ్వేం ఇవ్వగలవ్?

No comments:

Post a Comment